నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి భారీ మోసానికి పాల్పడ్డ సంఘటన ఏపీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతమంది కేటుగాళ్లతో కలిసి ఈ అవినితీకి పాల్పడగా బాధితులు వందల సంఖ్యలో ఉండటం విశేషం. కాగా వారినుంచి కోట్ల రూపాయలు వసూల్ చేసిన నిందితుడు.. విషయం బయటపడుతుందనే సమాచారంతో ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని సంప్రదించగా అసలు విషయం బటయపడింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పోలీసు అధికారి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ పరిచయమైంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఆ అధికారి ఎక్కడికి బదిలీపై వెళ్లినా ఆ బంధాన్ని కొనసాగించారు. ఆ అధికారి హోంగార్డు ఐజీగా పనిచేస్తున్న సమయంలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని 200 మంది యువకుల నుంచి దాదాపు రూ.16 కోట్లు వసూలు చేశారని సమాచారం అందింది. ఆయనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ భర్త, అల్లుళ్లు కలిసి ఈ వ్యవహారంలో ఒక ముఠాగా పనిచేశారని విచారణలో తేలింది. అయితే మొదట రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి ఉద్యోగాలు ఇప్పించిన నిందితులు.. మరిన్ని పరిచయాలు పెంచుకుని మరికొందరి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇదే సమయంలో వైయస్‌ఆర్ జిల్లా పెదముడియంకు చెందిన మనోజ్‌కుమార్‌కు తిరుపతి జిల్లా గూడూరువాసి నరేష్‌తో పరిచయం ఏర్పడింది. తనకు డీజీపీ కార్యాలయంలో సీనియర్ పోలీసు అధికారి తెలుసని, రూ.8.50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని నరేష్ నమ్మబలికాడు. మనోజ్‌కుమార్ అతనికి రూ.4 లక్షలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము ఉద్యోగం వచ్చాక ఇస్తానన్నారు. నెల తర్వాత డీజీ కార్యాలయంలో పనిచేసే ఓ హోంగార్డు సెల్ నుంచి మనోజ్‌కు సందేశం వచ్చింది. హోంగార్డు ఉద్యోగం వచ్చిందని వాట్సప్‌లో వచ్చిన లేఖను నిశితంగా పరిశీలించిన మనోజ్ అది నకిలీదని గుర్తించి, నరేష్‌ను నిలదీయడంతో అసలు బండారం బయటపడింది.
ఇది కూడా చదవండి : వేదికపైనే పెళ్లి కూతురిని రేప్ చేసిన విలన్.. ఆ సమయంలో తప్పలేదంటూ
ఈ క్రమంలోనే నరేష్, డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న అరవింద్ తనను మోసగించారంటూ మనోజ్ గతేడాది జులై 15న మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి, అసలు సూత్రధారి సీనియర్ ఐపీఎస్ అధికారి అని గుర్తించారు. ఈ కేసు విషయమై పోలీసులు పలుమార్లు తన ఇంటికి రావడంతో అరెస్టు చేస్తారేమోనని ఆ ఉన్నతాధికారి కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయస్థానం వారం రోజులు వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నారు. ఇక ఈ కేసులో కీలక వ్యక్తి బొర్రం వెంకటేష్‌ను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా విజయలక్ష్మి పెద్ద అల్లుడు నందకిషోర్‌ను కూడా అరెస్టు చేయగా.. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.