IPL : ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అత్యధిక స్కోరు రికార్డును సన్‌రైజర్స్(Sun Risers Hyderabad) రెండు సార్లు క్రియేట్ చేసింది. ఎక్కువ సార్లు 200కి పైగా స్కోర్లు నమోదైన సీజన్ కూడా ఇదే. అత్యధిక బౌండరీలు, పవర్ ప్లేలో అత్యధిక స్కోరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.తాజాగా ఐపీఎల్ 2024లో మరో రికార్డు నమోదైంది. యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) ఐపీఎల్ హిస్టరీలో 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు.జైపూర్‌లో ఏప్రిల్ 22న సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ చాహల్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. టోర్నమెంట్ చరిత్రలో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చాహల్ అత్యధిక వికెట్లు తీసిన వారిలో ముందున్నాడు. కేవలం 21.37 యావరేజ్‌తో ఈ ఘనత సాధించాడు. ప్రతి 16.6 బంతుల్లో ఒక వికెట్ తీశాడు. ప్రస్తుత ఐపీఎల్ 2024లో కూడా చాహల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్‌తో కలిసి పర్పుల్ క్యాప్ షేర్ చేసుకుంటున్నాడు. ముగ్గురూ 8 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసుకున్నారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చాహల్ ఐపీఎల్ కెరీర్ మొదలైంది. ఆర్సీబీకి కీలక బౌలర్‌గా ఎదిగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్లు పడగొడుతూ వికెట్ టేకింగ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాహల్ ఎనిమిది సీజన్లు ఆడాడు. మొత్తం 113 మ్యాచ్‌లలో 139 వికెట్లు సాధించాడు. చాహల్ సాధించిన 200 వికెట్లలో అత్యధికం ఆర్సీబీ తరఫునే పడగొట్టడం గమనార్హం.
Also Read : లారస్ స్పోర్ట్స్ అవార్డుల విజేతలు వీళ్లే..
2022 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాహల్‌ని వదులుకుంది. ఆ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆర్‌ఆర్‌లో చాహల్ మరింత మెరుగయ్యాడు. కేవలం 38 మ్యాచ్‌లలో మరో 61 వికెట్లు సాధించాడు.సాధారణంగా ఐపీఎల్ అనగానే బ్యాటర్ల ఆధిపత్యం గుర్తు వస్తుంది. అత్యధిక పరుగులు, బౌండరీలు చర్చ మొదలవుతుంది. కానీ క్రమంగా రాణిస్తూ టీమ్‌ల విజయాల్లో కీలకం మారిన బౌలర్లు కూడా ఉన్నారు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్ ఫైవ్‌లో ఎవరు ఉన్నారంటే.. యుజ్వేంద్ర చాహల్ 200*, DJ బ్రావో 183, చావ్లా 181, భువనేశ్వర్ కుమార్ 174, అమిత్ మిశ్రా 173 ఉన్నారు.
అయితే.. ఇలాంటి ఆటగాడికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్న చాహల్‌కి భారత జట్టులో చోటు దక్కకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సెలెక్టర్లు కళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. ఆడిన 8 మ్యాచ్‌లలో 7 విజయాలతో మొదటి స్థానం సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయాల్లో ఆర్‌ఆర్ బౌలర్లది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాహల్ కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టును పోటీలో నిలిపాడు.