/rtv/media/media_files/2026/01/24/israel-sanctions-2026-01-24-20-28-47.jpg)
Israel Sanctions
Israel Sanctions: గాజాలో వేల మంది మరణించినా(Gaza Killings) ఇజ్రాయిల్‌పై ఎందుకు ఆంక్షలు లేవు? అని ప్రముఖ రచయిత, జర్నలిస్టు స్టాన్లీ జానీ ప్రశ్నించారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో(Israel Gaza War) సుమారు 70 వేల మంది మరణించారని, అందులో 20 వేల మంది పిల్లలే ఉన్నారని ఆయన తెలిపారు. అయినా అంతర్జాతీయంగా ఇజ్రాయిల్‌పై ఎలాంటి కఠిన చర్యలు ఎందుకు లేవని విమర్శించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సుమారు 10 వేల మంది పౌరులు మరణించగానే రష్యాపై అన్ని రకాల ఆంక్షలు విధించారని గుర్తుచేశారు. కానీ ఇజ్రాయిల్ అమెరికాకు మిత్రదేశం కావడంతో ఆ దేశ చర్యలను ప్రపంచం ప్రశ్నించడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాలస్తీనా స్వతంత్ర దేశంగా మారడం దాదాపు అసాధ్యమే అని చెప్పారు.
At the Hyderabad Literary Festival, there was an important session on 'Prioritizing Palestine'. Here Sunita Reddy is interviewing Stanly Johny and Sarah Zia... pic.twitter.com/80iNlPBdbS
— pamela philipose (@pamelaphilipose) January 24, 2026
ఈ వ్యాఖ్యలు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన ‘పాలస్తీనా’ అంశంపై చర్చలో వెలువడ్డాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ చర్చలో ‘లెటర్స్ ఫ్రం గాజా’ పుస్తక సంపాదకురాలు సారా జియా, ‘ఇజ్రాయిల్-పాలస్తీనా: ఒరిజినల్ సిన్’ పుస్తక రచయిత స్టాన్లీ జానీ పాల్గొన్నారు.
సారా జియా మాట్లాడుతూ, పాలస్తీనాలో ప్రజలు ప్రతిరోజూ ప్రాణాలతో ఉంటామో లేదో అన్న భయంతో జీవిస్తున్నారని చెప్పారు. గాజా యువ రచయితలు రాసిన లేఖలు అక్కడి ప్రజల బాధలు, భయం, నిరాశను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయని వివరించారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు ఎలా మారాయో స్టాన్లీ జానీ వివరించారు. అప్పట్లో పాలస్తీనాలో యూదుల జనాభా కేవలం 5 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడు అది 55 శాతానికి చేరిందన్నారు. పాలస్తీనా భూభాగంలో దాదాపు 77 శాతం ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకుందని, ప్రస్తుతం గాజా, వెస్ట్ బ్యాంక్ పూర్తిగా వారి నియంత్రణలోనే ఉందని చెప్పారు.
యునైటెడ్ నేషన్స్ తీర్మానాలు, ఓస్లో ఒప్పందాలు ఉన్నా పాలస్తీనాకు పూర్తి స్వతంత్రత దక్కలేదని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్‌ను కారణంగా చూపుతున్నా, 1987కి ముందు హమాస్ అనే సంస్థే లేదని, అప్పట్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) మాత్రమే ఉందని గుర్తుచేశారు.
1993లో యాసిర్ ఆరాఫత్ పాలస్తీనాకు కేవలం 23 శాతం భూమి ఇచ్చినా సరే స్వతంత్ర దేశంగా ఉండేందుకు సిద్ధమని ప్రతిపాదించినా అది అమలుకాలేదని స్టాన్లీ జానీ అన్నారు. పాలస్తీనా విషయంలో పశ్చిమాసియా దేశాలు కూడా సరైన బాధ్యత చూపలేదని విమర్శించారు.
భారతదేశం కూడా 2015 వరకు 1967 సరిహద్దులు, జెరూసలేం రాజధానిగా రెండు దేశాల విధానంకు మద్దతు ఇచ్చేదని, ఇప్పుడు మాత్రం సరిహద్దుల ప్రస్తావన లేకుండా రెండు దేశాల మాట మాత్రమే చెబుతోందని అన్నారు. దీనికి ఇజ్రాయిల్‌తో భారత్‌కు ఉన్న రక్షణ, గూఢచారి భాగస్వామ్యమే కారణమని వ్యాఖ్యానించారు.
ఈ చర్చలో సునీతా రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తగా, అంతర్జాతీయ చట్టాలు, మీడియా పాత్ర, రాజకీయ బాధ్యతలపై వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. పాలస్తీనా అంశంలో ప్రపంచం చూపుతున్న ద్వంద్వ వైఖరిపై ఈ చర్చ మరోసారి గట్టి ప్రశ్నలు వేసిందని పాల్గొన్నవారు తెలిపారు.
Follow Us