రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు

అక్రమ వలసదారుల ఏరివేతలో రెండేళ్ల చిన్నారిని, ఆమె తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం మినియాపోలిస్‌లో ఎల్విస్ జోయెల్ తన రెండేళ్ల కుమార్తె క్లోయి రెనెటా టిపాన్‌తో కలిసి షాప్‌ నుంచి వస్తుండగా వారిని అరెస్ట్ చేశారు.

New Update
girl

అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల కఠిన చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా రెండేళ్ల చిన్నారిని, ఆమె తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గత గురువారం మినియాపోలిస్‌లో ఎల్విస్ జోయెల్ తన రెండేళ్ల కుమార్తె క్లోయి రెనెటా టిపాన్‌తో కలిసి షాప్‌ నుంచి ఇంటికి వస్తుండగా, ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెంబడించారు. సిటీ కౌన్సిల్ సభ్యుడు జాసన్ చావెజ్ తెలిపిన వివరాల ప్రకారం, అధికారులు ఎల్విస్ కారు అద్దాలను పగులగొట్టి, తండ్రీకూతుళ్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మొదట ఇది స్థానికులు 'కిడ్నాప్' అనుకున్నారు. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ, సదరు వ్యక్తులు ఈక్వెడార్‌కు చెందిన వారని, దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని పేర్కొంది. అధికారులు కారు ఆపినప్పుడు ఎల్విస్ డోర్స్ తీయకపోవడంతో కారు అద్దాలు పగలగొట్టి మరీ వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, చిన్నారిని తల్లికి అప్పగించేందుకు ప్రయత్నించగా ఆమె తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం చిన్నారి నిర్బంధం నుండి విడుదలైనట్లు వారి కుటుంబ న్యాయవాది కీరా కెల్లీ తెలిపారు.

ఇదే తరహా ఘటన మిన్నిసోటాలో కూడా చోటుచేసుకుంది. లియామ్ కోనెజో రామోస్ అనే ఐదేళ్ల బాలుడు స్కూల్ నుండి వస్తుండగా, అతని తండ్రితో సహా అధికారులు అదుపులోకి తీసుకుని టెక్సాస్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ విషయంలో కూడా DHS వివరణ ఇస్తూ.. చిన్నారిని అరెస్ట్ చేయాలనుకోలేదని,  అతని తండ్రి అక్రమ వలసదారుడు కావడం వల్లే నిర్బంధించామని స్పష్టం చేసింది. అక్రమ వలసల విషయంలో అమెరికా నిబంధనలు కఠినతరం కావడంతో వేలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. చిన్న పిల్లలను ఇలా నిర్బంధ కేంద్రాలకు తరలించడంపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు