ఎమర్జెన్సీ మార్షల్‌లా ప్రకటనతో చిక్కుల్లో పడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు పదవీ గండం ముంచుకొస్తోంది. ఆయన పై విపక్షాలు తీసుకొచ్చిన అభిశంసన తీర్మానం పై మరికొన్ని గంటల్లో పార్లమెంట్ లో ఓటింగ్ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యూన్ ఓ టెలివిజన్ ఛానల్ లో మాట్లాడుతూ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు.
ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని వెల్లడించారు. ఆ ప్రకటన కోసం నా రాజకీయ, చట్టపరమైన బాధ్యతను తప్పించుకోవలనుకోవడం లేదు. మార్షల్ లా కారణంగా ప్రజలను ఆందోళను , తీవ్ర అసౌకర్యానికి గురి చేసినందుకు గానూ క్షమాపణలు తెలియజేస్తున్నా.ఇంకోసారి ఎమర్జెన్సీ విధించే ప్రయత్నం చేయబోనని హామీ ఇస్తున్నా అని అధ్యక్షుడు యూన్ వెల్లడించారు.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ...యూన్ సుక్ యోల్ ఇటీవల ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే. దీని పై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంట్ ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు.
గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. చేసేదేం లేక వెనక్కి తగ్గిన అధ్యక్షుడు తన ప్రకటనను విరమించుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలతో దేశ వ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకత ఎదురైంది.అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంట్ లో ఆయన పై అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు.అటు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు మద్దతు కరువైంది.శనివారం సాయంత్రం 5 గంటలకు దక్షిణ కొరియా పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై అభిశంసన తీర్మానం పై ఓటింగ్ నిర్వహించనుంది.
దీని నుంచి గట్టేక్కాలంటే 300 మంది సభ్యులు ఉన్న దేశ పార్లమెంట్ లో 200 మంది యూన్ కు అనుకూలంగా ఓటేయ్యాలి. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఇతర చిన్న విపక్ష పార్టీలంతా కలిపి 192 మంది ఉన్నారు. ఇటీవల అధ్యక్షుడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం 190-0 తో నెగ్గింది.దీంతో ఆయనను పదవి నుంచి తొలగించడం ఖాయంగానే కనిపిస్తోంది.