పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్.. 47 మంది పార్టీ లీడర్లకు జైలు శిక్ష

2023లో జరిగిన హింసాత్మక ఘటనల్లో PTI పార్టీకి చెందిన 47 మంది అగ్రనేతలకు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరూ తలా 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

New Update
_Pakistan anti-terrorism court

ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు తీర్పుతో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2023లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన 47 మంది అగ్రనేతలకు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) పదేళ్ల జైలు శిక్ష విధించింది. కేవలం జైలు శిక్షే కాకుండా, దోషులుగా తేలిన ప్రతి ఒక్కరూ తలా 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

మే 9 అల్లర్లు

2023లో అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. 2023 మే 9న ఈ నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి. పీటీఐ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆరోపించింది. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం, ప్రముఖ ఆర్మీ మ్యూజియం, పలు మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ బిల్డింగులు దాడులకు గురైయ్యాయి. 

కోర్టు తీర్పు - ఆస్తుల స్వాధీనం

ఈ ఘటనలపై సుదీర్ఘ విచారణ జరిపిన యాంటీ టెర్రరిజం కోర్టు, దాదాపు మూడేళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది. దాడులకు బాధ్యులుగా గుర్తించిన 47 మంది పీటీఐ నేతలు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో, సదరు నేతల స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఇది పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై నీలినీడలు
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, జైలులో ఆయనకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా తీర్పుతో పీటీఐ నాయకత్వం మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు