Japan: జపాన్‌పై మరోసారి ప్రకృతి ప్రకోపం చూపించింది. వారం రోజులుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్య జపాన్‌లోని నాలుగు నగరాల్లో కుండపోత. ఇషికామా ప్రాంతంలో 12 నదుల ఉగ్రరూపం చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. జపాన్‌లో ఎటు చూసినా వరద నీరు దర్శనమిస్తోంది. అక్కడి కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్ల మధ్యలోనే నీటి ప్రవాహం కొనసాగుతోంది.
24 గంటల్లో..
చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ధాటికి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోగా.. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. వాజిమాలో 18 వేల మంది, సుజులో 12 వేల మంది..నిగాటాలో 16 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే వరదల ముప్పు హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈఏడాది ఆరంభంలో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదు అయింది. భూకంపం కారణంగా 200 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.