Epstein Files: 'ఎప్‌స్టీన్' ఫైల్స్‌లో సంచలనం.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ‘వైల్డ్’ డిన్నర్ పార్టీ ఫొటోలు వైరల్!

జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ డిన్నర్ పార్టీ ఫొటోలు బయటపడ్డాయి. 2015లో జరిగిన ఈ పార్టీలో పలువురు టెక్ దిగ్గజాలు పాల్గొన్నారు. అయితే ఇది ఎప్‌స్టీన్ నేరాలకు సంబంధం ఉన్నట్టు నిర్ధారణ కాదని అధికారులు స్పష్టం చేశారు.

New Update
Epstein Files

Epstein Files

Epstein Files: జెఫ్రీ 'ఎప్‌స్టీన్'కు సంబంధించిన కొత్త ఫైల్స్ విడుదల కావడంతో మరోసారి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ డాక్యుమెంట్స్‌లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk), మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) ఒక లగ్జరీ డిన్నర్ పార్టీలో పాల్గొన్న ఫొటో బయటపడింది. ఈ పార్టీని 'ఎప్‌స్టీన్' స్వయంగా “వైల్డ్” అంటూ వర్ణించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

2008లో మైనర్ల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన తర్వాత కూడా 'ఎప్‌స్టీన్' ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్టు ఈ ఫైల్స్ సూచిస్తున్నాయి. 2015 ఆగస్టు 3న తీసిన ఈ ఫొటోలో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వద్ద ఎదురెదురుగా కూర్చుని కనిపించారు. మస్క్ కెమెరా వైపు చూస్తుండగా, జుకర్‌బర్గ్ సీరియస్‌గా ముందుకు చూస్తూ కనిపించారు. ఈ ఫొటోను ఎప్‌స్టీన్ తనకే తాను ఈమెయిల్ చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.

ఈ పార్టీలో లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మాన్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ కూడా హాజరైనట్టు ఎప్స్టీన్ ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 2, 2015న పీటర్ అట్టియాకు పంపిన మెయిల్‌లో “ఈ రోజు మస్క్, థీల్, జుకర్‌బర్గ్‌లతో డిన్నర్” అని ఎప్స్టీన్ రాసినట్టు వెల్లడైంది. తరువాత ఆగస్టు 20న మరో బిలియనీర్ టామ్ ప్రిట్జ్కర్‌కు పంపిన మెయిల్‌లో ఈ డిన్నర్‌ను “వైల్డ్” అని పేర్కొన్నారు.

ఈ డిన్నర్ పార్టీ గురించి తొలిసారి 2019లో వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ కథనం వెలువరించింది. కాలిఫోర్నియాలోని పాలొ ఆల్టోలో రీడ్ హాఫ్‌మాన్ ఈ విందును నిర్వహించారని, MIT శాస్త్రవేత్త ఎడ్ బాయ్డెన్ కోసం ఈ సమావేశం జరిగినట్టు అప్పట్లో తెలిపింది.

రీడ్ హాఫ్‌మాన్ ఎప్‌స్టీన్ తో తన సంబంధాలపై స్పందిస్తూ, అవి కేవలం MIT ఫండ్‌రైజింగ్ కోసమేనని చెప్పారు. ఎప్‌స్టీన్ తో తన భేటీలను ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. ఎప్స్టీన్ బాధితులకు పూర్తి నిజాలు తెలియాల్సిందేనని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, ఎలాన్ మస్క్ ఇటీవల “నేను ఎప్పుడూ ఎప్‌స్టీన్ పార్టీలకు వెళ్లలేదు” అని చెప్పిన మాటలకు ఈ ఫొటోలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఫైల్స్‌లోని సమాచారం ఎప్‌స్టీన్ చేసిన నేరాల్లో వీరు పాల్గొన్నారు అన్న నిర్ధారణ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్లు రావడంతో ఎలాన్ మస్క్, రీడ్ హాఫ్‌మాన్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కూడా జరిగింది. 2013లో స్పేస్‌ఎక్స్ టూర్‌కు ఎప్‌స్టీన్ వెళ్లినట్టు వచ్చిన మెయిల్‌పై మస్క్ స్పందిస్తూ తనకు అలాంటి సమావేశం గుర్తు లేదని గతంలోనే ఖండించారు. ఈ తాజా పరిణామాలతో ఎప్‌స్టీన్ కేసు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు