/rtv/media/media_files/2025/10/23/russian-spy-anna-chapman-2025-10-23-21-38-27.jpg)
గతంలో తన అందం, మేధస్సుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి, అమెరికాలో అరెస్టై పబ్లిక్ సెలబ్రిటీగా మారిన మాజీ రష్యన్ గూఢచారి అన్నా చాప్‌మన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమెను తాజాగా రష్యాలోని నూతనంగా స్థాపించబడిన 'మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్' అధిపతిగా నియమించారు. గూఢచర్యం నుంచి గ్లామర్ ప్రపంచంలోకి, ఇప్పుడు రష్యా గూఢచార చరిత్ర సంరక్షకురాలిగా ఆమె ప్రయాణం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. 1982లో వోల్గోగ్రాడ్‌లో జన్మించిన అన్నా చాప్‌మన్, రష్యా విదేశీ గూఢచార సంస్థ తరపున పనిచేసింది. 2010లో, అమెరికాలోకి చొరబడి కీలక సమాచారాన్ని సేకరించే రష్యన్ 'స్లీపర్ సెల్' సభ్యురాలిగా న్యూయార్క్‌లో ఎఫ్‌బీఐ ఆమెను అరెస్టు చేసింది. అప్పటి 'కోల్డ్ వార్' అనంతర అతిపెద్ద గూఢచార మార్పిడి ఒప్పందంలో భాగంగా ఆమెతో పాటు మరో తొమ్మిది మంది ఏజెంట్లను అమెరికా రష్యాకు అప్పగించింది.
Putin’s ‘Black Widow’ returns! Who is Anna Chapman and why is the spy back in Russian intelligence?
— Mathrubhumi English (@mathrubhumieng) October 23, 2025
Read more:https://t.co/U3lebQQvRe#Spy#Russia#Putin#SPY#BlackWidow
రష్యాకు తిరిగి వచ్చిన తర్వాత, చాప్‌మన్ తనకున్న అపారమైన ప్రచారాన్ని ఉపయోగించుకుని తక్కువ టైంలోనే ప్రముఖ వ్యక్తిగా మారింది. ఆమె టీవీ షోల వ్యాఖ్యాతగా, మోడల్‌గా, వ్యాపారవేత్తగా ఎదిగింది. దేశభక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, రష్యా రాజకీయ ప్రముఖులకు దగ్గరైంది. పశ్చిమ దేశాల మీడియా ఆమెను 'బ్లాక్ విడో' అని, రష్యా మీడియా 'ఏజెంట్ 90-60-90' అని అభివర్ణించింది. క్రెమ్లిన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన ఈ 43 ఏళ్ల మాజీ గూఢచారికి 'మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్'కు నాయకత్వం వహించే బాధ్యత అప్పగించడం ఒక 'సింబాలిక్' చర్యగా అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మ్యూజియం రష్యా గూఢచార చరిత్ర, వారి విజయాలను ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడింది. రష్యా గూఢచార వారసత్వాన్ని, జాతీయ ప్రతిష్టను చాటిచెప్పేందుకు అన్నా చాప్‌మన్ ఎంపికను పుతిన్ ప్రభుత్వం ఒక సాధనంగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది గూఢచర్యం యొక్క గ్లామరైజ్డ్ కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రష్యా చేస్తున్న ప్రయత్నంలో భాగమని విశ్లేషకులు అంటున్నారు.
Follow Us