Lebanan: హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకు పైగా లక్ష్యాలపై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ వైమానికి దాడుల్లో 21 మంది చిన్నారులు సహా 356 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరో 1246 మందికి గాయాలైనట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం నుంచే ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు మొదలు పెట్టినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాలను నామరూపాల్లేకుండా చేయాలనే ప్రణాళికలో భాగంగానే ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోందని తెలిపింది. దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు మరికొన్ని శక్తిమంతమైన దేశాలను కోరింది.
హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే వెల్లడించింది. దక్షిణ ప్రాంతంలో హెజ్‌బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన స్థావరాలు,నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్ మరో గాజాలా మారుతోందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.