వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఐక్యరాజ్యసమితి. వైకల్యంతో ఉన్న వారిపై చిన్నచూపు చూపకుండా వారి కోసం 1992లో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని (International Day of Persons with Disabilities) జరుపుకుంటున్నారు. వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్న ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రతిసంవత్సరం వారి కోసం ఈరోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకెళుతున్నారు. వికలాంగులు వెనుకబాటుకు గురికాకుండా వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించి, సమాజంలో వారికంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వారి పరిస్థితులపై రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల పరంగా అవగాహన పెంచడమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లక్ష్యం.
ఐక్యరాజ్యసమితి 1998 నుంచి ఏటా డిసెంబర్ 3న ఒక నిర్ధిష్ట థీమ్తో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. వృద్ధాప్యంలో నాన్-కమ్యూనికేషన్ వ్యాధుల ప్రాబల్యం కారణంగా వికలాంగుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేసింది. కరోనా వల్ల తలెత్తిన సంక్షోభం, ఇప్పటికే ఉన్న అసమానతలను తీవ్రతరం చేస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో అత్యంత అసమానతలు ఎదుర్కొంటున్న సమూహాల్లో అంగవైకల్యం ఉన్నవారు ప్రధానంగా ఉన్నారు. కరోనా సంక్షోభంలో మరణాల పరంగానూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది.
1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 47/3 ప్రకటించిన తర్వాత వార్షిక వేడుకలు షురూ అయ్యాయి. 2006లో వికలాంగుల హక్కులపై కన్వెన్షన్ (CRPD) కూడా ఆమోదం పొందింది. స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేసి వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించే దిశగా పని చేయడం దీని లక్ష్యంగా పెట్టుకుంది. అంగవైకల్యం అనేది ఒక సమస్య కాదు. వ్యాధి కూడా కాదు. వాళ్లు కూడా మనలాంటి వారే. వారి పట్ల మనం మంచిగా మెలగడం అనే విషయంలో సమాజాన్ని మరింతగా చైతన్య పరచాలి. వారి కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలి. వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా సరికొత్త ఆవిష్కరణలు, రికార్డులు సృష్టించగలిగారు. ఇంకా సృష్టిస్తున్నారు. వారికి కావాల్సిందల్లా మేమున్నామమే భరోసా మాత్రమే.
ఇది కూడా చదవండి: ఈ సారి అసెంబ్లీలోకి 10 మంది మహిళలు.. లిస్ట్ ఇదే!