అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్ధాలకు చెందిన గుట్టును ఖగోళ శాస్త్రవేత్తలు విప్పారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి వస్తున్న ఆ ధ్వనులకు చెందిన కీలక ప్రటకన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్ధాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్వరాలను గుర్తుపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తులు గురువారం ప్రకటన చేశారు. దీంట్లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కీలక పాత్ర పోషించారు. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కినట్లు నిర్ధారించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నట్లు ఆస్ట్రోఫిజిస్టులు వెల్లడించారు. నక్షత్రాలు, పాలపుంతలు.. దాటుతూ సుదూర తీరాల నుంచి ఆ హమ్మింగ్ వస్తున్నట్లు తెలిపారు.
గెయింట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్ తో పాటు బెంగుళూరులోని రామన్ రీసర్చ్ ఇన్స్‌టిట్యూట్ పరిశోధకులు కాస్మిక్ ధ్వని గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం సాగింది. ఇండియాతో పాటు కెనడా, యూరోప్, చైనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ స్టడీలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లు శ్రమించి వాళ్లు డేటాను సేకరించారు.
పల్సర్స్ అనే మండిన నక్షత్రాలను శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆ నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ తరంగాలు చాలా శక్తివంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గడిచిన 18 ఏళ్లలో 115 పల్సర్స్ గురించి స్టడీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పల్సర్స్ మిలియన్ల రెట్లు శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్ధాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు.