కొల్లాపూర్ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. చేతులు కలిపిన నాయకులు

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కోలాహలం నెలకొంది. సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది.

New Update
కొల్లాపూర్ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. చేతులు కలిపిన నాయకులు

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి మొదలైంది. సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జూపల్లి, టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని చేతులు కలుపుతూ అభివాదం చేశారు. ఇది చూసిన కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇద్దరు నేతలు కొల్లాపూర్‌ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కర్ణాటక పీసీసీ ఉపాధ్యక్షులు నాగర్ కర్నూల్, పార్లమెంటరీ ఇంచార్జ్ టీవీ మోహన్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, వంశీకృష్ణ సూచించారు. కొల్లాపూర్ టికెట్ ఎవరికి వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ఇక టికెట్ అంశాన్ని జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు చూసుకుంటాయని చింతలపల్లి జగదీశ్వరరావు తెలిపారు. పార్టీ ఆ దిశగా సర్వేలు చేపడుతుందని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ప్రజలను పథకాల పేరుతో మోసం చేస్తుందని.. వాటి గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తే కాంగ్రెస్ గెలుపు సునాయాసం అవుతుందని మాజీ మంత్రి జూపల్లి వెల్లడించారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జూపల్లి రాకపై సీనియర్ నేతలు ధిక్కార స్వరాలు వినిపించారు. పార్టీలో చేర్చుకునే పని అయితే కొల్లాపూర్ టిక్కెట్ ఇస్తామని హామీ ఇవ్వకుండా చేర్చుకోవాలని సూచించారు. జూపల్లికి ఎట్టి పరిస్థితుల్లో కొల్లాపూర్ టిక్కెట్ ఇవ్వొద్దని వరుసగా నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టారు. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తమకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేల ఆధారంగా కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనకే టికెట్ కేటాయించాలని చింతపల్లి జగదీశ్వర్ రావు కోరారు. జూపల్లిని పార్టీలోకి ఆహ్వానిస్తాం కానీ అతడికి టికెట్ కేటాయించడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. నాగర్‌ కర్నూలు సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కూడా జూపల్లి చేరికపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా చింతపల్లి, జూపల్లి ఒకే వేదికపై కూర్చుని అభివాదం చేసుకోవడం శుభపరిణామని కార్యకర్తలు చెబుతున్నారు. అందరూ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు