Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఈ హత్య కంటే హత్యకు సంబంధించి భారత్‌ను ఉద్దేశించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలే ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రంగా క్షీణించాయి.
తాజాగా ఈ వివాదంపై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్.. కెనడా ప్రధాని ట్రూడోతో మాట్లాడారు. భారత్‌తో తలెత్తిన ఈ ప్రస్తుత వివాదం వీలైనంత త్వరగా ముగుస్తుందని తాను భావిస్తున్నానని జస్టిన్ ట్రూడోతో రిషి సునాక్ పేర్కొన్నట్లు బ్రిటన్ వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం రిషి సునాక్, జస్టిన్ ట్రూడో మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు.. బ్రిటన్ అధికారిక భవనం డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే భారత్‌లోని కెనడా రాయబారులకు సంబంధించిన వివరాల గురించి రిషి సునాక్‌కు జస్టిన్ ట్రూడో వివరించారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ సూత్రాలతో సహా అన్ని దేశాలు సార్వభౌమాధికారం, చట్ట నియమాలను గౌరవించాలనే బ్రిటన్ వైఖరిని మరోసారి ఆ దేశ ప్రధాని రిషి సునక్ పునరుద్ఘాటించారు. భారత్, కెనడా మధ్య నెలకొన్న వివాదం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది.
మరోవైపు భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అక్కడి భారత విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాల నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగావకాశాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. మిగతా దేశాల విద్యార్థులతో పోలిస్తే కెనడాలో గతేడాది అత్యధికంగా 2,26,450 మంది భారతీయ విద్యార్థులు స్టడీ పర్మిట్లు అందుకున్నారు. భారత్-కెనడా మధ్య విభేదాల గురించి తాను అంతగా ఆలోచించడం లేదని, తన ఆందోళనంతా భవిష్యత్తు కోసమేనని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాల కొరత చాలా ఉందని, చదువు పూర్తయ్యాక ఉద్యోగం పొందగలనో, లేదోనని మరో విద్యార్థి చెప్పుకొచ్చాడు. గ్రేటర్ టొరంటో పరిధిలోని చాలామంది విద్యార్థులు ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ వైద్య డిగ్రీలు అందుకున్న ఎంతోమంది భారతీయ విద్యార్థులు తనకు తెలుసని, వారందరూ మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందలేకపోయారని, దీంతో వారు క్యాబ్‌లు, దుకాణాలు నడుపుకుంటున్నారని, మరికొందరు రెస్టారెంట్లలో పనిచేస్తున్నారని తెలిపాడు. ఇది చాలా సవాలుతో కూడిన పరిస్థితి అని మరికొందరు విచారం వ్యక్తం చేశారు.
Also Read:రిపోర్టింగ్ చేస్తుండగా పేలిన బాంబు.. ఆ మహిళా జర్నలిస్ట్ ధైర్యానికి సెల్యూట్..!