Fire Accident: అమెరికాలో దారుణం జరిగింది. పై చదువుల కోసం అగ్ర రాజ్యానికి వెళ్లిన యువకుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కొల్పోవడం సంచలనంగా మారింది. ఈ మేరకు న్యూయార్క్ (New York) నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన యువ జర్నలిస్టు మృతి చెందాడు.
కాపీ ఎడిటర్‌గా..
ఈ మేరకు పోలీసులు, భారత ఎంబజీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌కు చెందిన ఫాజిల్ ఖాన్ (27) ఇండియాకు సంబంధించిన ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేశాడు. అయితే జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లి అక్కడ కొలంబియా జర్నలిజం స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అయితే శుక్రవారం నాడు తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్ బైక్ లోని లిథియం అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీయగా.. ఫాజిల్ మంటల్లో చిక్కుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఈ ప్రమాదంలో కొంతమంది కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకోగా.. 17 మందికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రమాదంపై స్పందించని భారత కార్యాలయం.. ఫాజిల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉన్నామని, మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపింది.