India vs Ban: క్షణం క్షణం ఉత్కంఠ.. కానీ చివరికి ఫలితం రాలేదు

బంతి బంతికి ఉత్కంఠ. క్షణం క్షణం టెన్షన్. భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచులో అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో ముగిసింది.

New Update
India vs Ban: క్షణం క్షణం ఉత్కంఠ.. కానీ చివరికి ఫలితం రాలేదు

India vs Bangladesh

తృటిలో చేజారిన సిరీస్..

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టుకు తృటిలో వన్డే సిరీస్ దక్కకుండా పోయింది. సిరీస్ డిసైడర్ మ్యాచులో ఫలితం తేలలేదు. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన మూడే వన్డే మ్యాచ్ చివరకు టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 225/4 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ ఫర్‌గానా హోక్ 107 పరుగులతో రాణించింది. ఈ సెంచరీతో మహిళల వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా చరిత్ర నెలకొల్పింది. మరో ఓపెనర్ షమీమా సుల్తానా 52 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. దేవికా విద్య ఓ వికెట్ పడగొట్టింది.

రాణించిన స్మృతి.. హర్లీన్ డియోల్..

226 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో స్మృతి మంధానా 59, హర్లీన్ డియోల్ 77 పరుగులతో రాణించారు. ఆల్‌రౌండర్ జెమీమా రోడ్రిగ్స్ 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. 191/4 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్.. చేజేతులా మ్యాచ్‌ను టైగా ముగించింది. చివరి ఓవర్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి రెండు బంతులకు రెండు రన్స్ వచ్చాయి. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన తరుణంలో మూడో బంతి ఆడిన మేఘనా సింగ్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ చేజారింది. బంగ్లా బౌలర్లో నహిదా అక్తర్ మూడు, మరుషా అక్తర్ రెండు వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ బంగ్లా గెలవగా.. రెండో మ్యాచ్ భారత్ దక్కించుకుంది. ఇప్పుడు మూడో మ్యాచ్ టై అవ్వడంతో 1-1తో సిరీస్ సమమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్లీన్ డియోల్ నిలవగా.. ఫర్గాన హాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో భారత్ దక్కించుకుంది.

తొలి బంగ్లా విమెన్ క్రికెటర్‌గా రికార్డు..

ఈ మ్యాచులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు ఓపెనర్ ఫర్గానా హోక్ చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. 2013 ఏప్రిల్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్ సల్మా చేసిన 75 పరుగులే బంగ్లా తరపున వన్డేల్లో అత్యధిక స్కోర్‌గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును ఫర్గానా బద్దలుకొట్టింది. దీంతో పాటు ఫర్గానా మరో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బంగ్లా బ్యాటర్‌గా నిలిచింది. 56 మ్యాచ్‌లు ఆడిన ఫర్గానా 1240 పరుగులు చేయగా.. అందులో 9 హాఫ్ సెంచరీలు చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు