Rajamahendravaram: ఎంపీల సస్పెన్షన్ పై రాజమహేంద్రవరంలో ఆందోళన

పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని కోరితే ఎంపీలను సస్పెండ్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Rajamahendravaram: ఎంపీల సస్పెన్షన్ పై రాజమహేంద్రవరంలో ఆందోళన

Rajamahendravaram: పార్లమెంట్‌లో దాడి చేసిన ఆగంతకులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్న ఇండియా కూటమి పక్ష పార్టీల ఎంపీలను అన్యాయంగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జాంపేట జంక్షన్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎం.ఎల్‌. న్యూడెమోక్రసీ, ఆప్‌ పార్టీలు నిరసన ప్రదర్శన చేపట్టాయి.

ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించడం సరికాదని, ఇండియా కూటమికి చెందిన 150 మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్‌ చేసి నల్లచట్టాలను ఆమోదించడం చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో జరిగిన ఘటనకు సంబంధించి విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చమంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీసారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్‌తోనే వచ్చారని విచారణ చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్‌ చేసారు.

Also Read: రేపే వ్యూహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌..పవన్‌, చంద్రబాబు, లోకేష్‌కు ఆర్జీవీ ఆహ్వానం.!

పార్లమెంట్ లో జరిగిన దాడిని ఖండిస్తూ విచారణ చేయాలని 150 మంది ఎంపీలు డిమాండ్‌ చేస్తూంటే వారిని సస్పెండ్‌ చేసి నల్ల చట్టాలను ఆమోదింప చేసుకోవడం ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేయడమే అన్నారు. వారందరిపై తక్షణం సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో పాటు అందరి సమక్షంలో మళ్లీ చట్టాలపై బిల్లులు ప్రవేశపెట్టి చర్చించిన తరువాతనే ఆమోదించాలని డిమాండ్‌ చేసారు.

రాష్ట్రంలో మోదీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న వైపిపి, టీడీపీ, జనసేన పార్టీల వైఖరిని కూడా ప్రజలందరూ గమనించాలని కోరారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే వరకు దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెస్తామని స్పష్టం చేసారు.

Advertisment
తాజా కథనాలు