భారీ ఆధిక్యంలో రోహిత్ సేన..
క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన అదరగొడుతోంది. నాలుగో రోజు 229/5 పరుగులతో ఆట ప్రారంభించిన విండీస్ బ్యాటర్లను హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ హడలెత్తించాడు. వేగంగా బంతులేస్తూ చకచక వికెట్లు తీశాడు. దీంతో మరో 26 పరుగులు మాత్రమే కరేబియన్ జట్టు ఆలౌట్ అవ్వడంతో ఇండియాకు 183 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాత్ వైట్(75)తో రాణించగా టగ్ నరైన్ చంద్రపాల్ (33), మెకంజీ(32)లు ఫర్వాలేదనించారు. భారత బౌలర్లలో సిరాజ్(Mohammed Siraj)ఐదు వికెట్లు, అరంగేట్ర బౌలర్ ముకేశ్ కుమార్ రెండు, రవీంద్ర జడేజా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.
ఐదు వికెట్లతో అదరగొట్టిన సిరాజ్..
నాలుగో రోజు ఆట ఆరంభమైన మొదటి ఓవర్‌లోనే విండీస్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అథనేజ్(37) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తనదైన పేస్ ఎటాక్‌తో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో తన ఖాతాలో మరో ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ వేగంగా పరుగులు చేస్తోంది. మరిన్ని పరుగులు జోడించి విండీస్ జట్టుకు భారీ లక్ష్యం ఇచ్చే దిశగా కొనసాగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగుతున్నాడు.
500వ మ్యాచులో కోహ్లీ సెంచరీ..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో కింగ్ కోహ్లీ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ కోహ్లీకి 500వ మ్యాచ్ కావడం విశేషం. దీంతో 500వ మ్యాచులో సెంచరీ చేసిన మొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ 80, యశస్వి జైస్వాల్ 57, రవీంద్ర జడేజా 61, రవిచంద్రన్ అశ్విన్ 56 పరుగులతో రాణించారు. ఇప్పటికే తొలి టెస్టులో విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో ముందు వరుసలో ఉంది. ఈ మ్యాచులో కూడా విజయం సాధిస్తే సిరీస్ రోహిత్ సేన వశమైంది. టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి.