అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ జంతువులు ప్రజలను వణికిస్తున్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడపాదడపా అటవీ జంతువులు దాడులు చేస్తుండటంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పలుచోట్ల పులులు, చిరుతలు, ఇతర అటవీ జంతువులు పశువులపై దాడులకు పాల్పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
గత సంవత్సరం అయితే ఓ పెద్ద పులి మనుషులపైనే పంజా విసరడం కలకలం రేపింది. ఇక అటవీ ప్రాంతానికి దగ్గరలో పంటపొలాలు కలిగి ఉన్నరైతులు వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే బిక్కు బిక్కుమంటున్నారు. ఎటువైపునుండి ఏ అటవీ జంతువు వస్తుందోనన్న భయం వారిని వెంటడుతోంది. ఈ పర్థిస్థితుల్లో ఓ ఏనుగు భీభత్సం సృష్టించడం మరింత కలవరపెట్టింది. ఏనుగు దాడిలో ఇలా ఇరువురు రైతులు మృత్యువాతపడటం జిల్లా చరిత్రలోని ప్రథమం.
అయితే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు మిర్చి పొలంలో పనులు చేసుకుంటున్న రైతు శంకర్ పై దాడి చేసి హతమార్చింది. కొన్నిగంటల్లోనే పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామ పరిసరాల్లోకి వెళ్ళి ఇంటి నుండి పొలానికి వెళుతున్న రైతు పోచయ్యపై దాడి చేసింది. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూరు, కౌటాల మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఏనుగు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరకు ఏనుగు ప్రాణహిత నది దాటి వెళ్ళిపోయిందని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.