East Godavari : తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెం గ్రామంలో చనిపోయిన వ్యక్తి ఫోన్ చేసిన ఘటన కేసును చేధించారు పోలీసులు. భీమా సొమ్మును కాజేసేందుకు రైతు కేతుమల్ల వెంకటేశ్వరరావు అలియాస్ పోశయ్య మరో ముగ్గురుతో కలిసి స్కెచ్ వేశాడు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. వెంకటేశ్వరావు పొలానికి వెళ్లి విద్యుత్ ఘాతానికి గురై చనిపోయాడని భావించారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.
కొన్ని గంటలకే..
అయితే, కొన్ని గంటలకే సినీమాను మించిన ట్విస్ట్ ఎదురైంది. తాను బతికే ఉన్నానంటూ ధాన్యం వ్యాపారి పోశయ్య ఫోన్ చేశాడు. తనని ఎవరో ముగ్గురు వ్యక్తులు కొట్టి రాజమండ్రి రూరల్ ప్రాంతంలో వదిలేసి పోయారని బంధువులకు ఫోన్ ద్వారా తెలిపాడు. పోశయ్య ఇచ్చిన సమాచారంతో రాజమండ్రి చేరుకుని అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also Read: జనసేన VS టీడీపీ.. కడపలో స్టిక్కర్స్ వార్..!
భీమా సొమ్ము స్కెచ్..
చనిపోయిన వ్యక్తి ఎవరు అని కోణంలో కేసును సీరియస్ గా తీసుకున్నారు రంగంపేట పోలీసులు. ఈస్ట్ జోన్ డిఎస్పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సి ఏ శివ గణేష్, ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో రెండు టీములుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. నాలుగు రోజుల వ్యవధి లోనే కేసును చేధించారు. తన పేరు మీద గల భీమా సొమ్ము రూ. 40 లక్షల కోసం భీమా సంస్థను మోసం చేసేందుకు స్కెచ్ వేసినట్లు తేలింది.
డెడ్ బాడీని తగలబెట్టి..
రాజమండ్రి హుకుంపేటకు చెందిన స్నేహితుడు వందే శ్రీనుకు రూ. 10వేలు ఇచ్చి చనిపోయిన మృతదేహం కావాలని పోశయ్య కోరాడు. మారంపూడికి చెందిన స్మశానంలో గోతులు తీసే చిన్ని, సుబ్బారావులను సంప్రదించి పాత బొమ్మూరు స్మశాన వాటికలో చనిపోయిన మృతదేహం వెలకితీశారు. పాత వీరంపాలెం కేతు మల్ల గంగాధర్ అనే రైతు పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పెట్రోల్ తో తగలబెట్టాడు. తాను చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా పోశయ్యను విచారించగా.. భీమా సొమ్మును కాజేసేందుకు ప్లాన్ వేసినట్లు బయటపెట్టాడు. ఈ కేసులో పోసయ్యకు సహకరించిన ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్ పంపించారు. నిందితులు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. రంగంపేట పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై డీఎస్పీ కిషోర్ కుమార్ వివరాలు వెల్లడించారు.