కాకినాడ జిల్లాలో మైనర్ బాలిక నిశ్చితార్థం అడ్డుకున్నారు ఐసిడిఎస్ సిబ్బంది. సామర్లకోట పట్టణంలో ఒక మైనర్ బాలిక వివాహ తంతును ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక తోటవారి వీధికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికకు పెద్దాపురం పట్టణానికి చెందిన ఆమె మేనమామతో వివాహం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం రహస్యంగా బాలికకు నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చెయ్యగా అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో కాకినాడ చైల్డ్ వెల్ఫేర్ జిఎంఎస్‌కే లక్ష్మి, స్థానిక అంగన్వాడీలు వి వెంకటలక్ష్మి, ఎం వి శ్రీలక్ష్మి, వానీదేవి, టి నాగమణి లు బాలిక గృహానికి వెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మైనర్ బాలిక వివాహానికి సంబంధించి సమాచారం రావడంతో ఈ నెల 20వ తేదీన రెండు కుటుంబాలను పిలిపించి బాల్య వివాహాలు, మేనరిక వివాహాల వలన కలిగే ఆరోగ్య సమస్యలు, నష్టాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. బాలికకు 18 సంవత్సరాలు వయసు నిండే వరకు వివాహం చెయ్యమని ఇరు కుటుంబాల నుంచి హామీపత్రాలు తీసుకున్నట్టు చెప్పారు.
Also Read: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి..!
అయితే, నేడు రహస్యంగా నిశ్చితార్థం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో వారు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే పెళ్ళి కుమారుని తరపు బంధువులు 20 మంది సిద్ధంగా ఉండి తమ రాకను గమనించి పెళ్లి కుమారుడు లేకుండానే నిశ్చితార్థ సామాగ్రిని బాలికకు, ఆమె కుటుంబ సభ్యులకు అందించినట్లు చెప్పారు. కాగా ఈ తంతు చెల్లదని, చట్టప్రకారం వారు నేరం చేస్తున్నట్టు హెచ్చరించామన్నారు. దాంతో పెళ్లి ఇప్పుగే జరిపించమని, బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాతే వివాహం జరిపిస్తాని అంతవరకు పెళ్లి కుమార్తె తమదని అనిపించు కునేందుకు నిశ్చితార్థం చేసుకుంటున్నామని బంధువులు ప్లేటు ఫిరాయించారు. ఏది ఏమైనా వివాహ వయసు రాకుండా బాలికకు వివాహం జరిపిస్తే కఠిన శిక్షకు బాధ్యులవుతారని ఇరు పక్షాల కుటుంబాలను సిబ్బంది హెచ్చరించినట్టు తెలిపారు.