HYD-VJY : హైదరాబాద్ (Hyderabad) – విజయవాడ గుండా ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎట్టకేలకు భారీ శుభవార్త అందించింది. ఈ రూట్ జాతీయ రహాదారిపై రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది. ఈ మేరకు 17 బ్లాక్ స్పాట్ల రిపేర్లు చేపట్టనుండగా.. రూ.375 కోట్లతో 17 చోట్ల ఫ్లై ఓవర్లు, జంక్షన్ల డెవలప్ మెంట్లు, సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ లతోపాటు సైన్ బోర్డులు ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగానే జూన్ 23న నార్కట్ పల్లి సమీప చిట్యాల దగ్గర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) శంకుస్థాపన చేశారు.
ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేలా..
అయితే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ (Vijayawada) జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా రహదారిపై గ్రామాలు, మూలమలుపులు, క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఈ ఇష్యూను ఇటీవలే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లగా వెంటనే ఈ పనులకు నిధులు విడుదల చేశారు. దీంతో ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.
500 మీటర్లలోనే 3 ఏళ్లలో ఏడాదికి 5 సార్లు..
ఇక రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం 500 మీటర్లలో వరుసగా 3 ఏళ్లలో ఏడాదికి 5 సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు, తీవ్ర గాయాలు సంభవించడం, లేక ఒకేసారి జరిగిన ప్రమాదంలో 10 మరణాలు నమోదైతే ఈ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర పోలీసుశాఖ నమోదుచేసిన వివరాలను జాతీయ రహదారులశాఖ పరిధిలోని ట్రాన్స్‌పోర్ట్ రిసెర్చ్ వింగ్ (టీఆర్‌డబ్ల్యూ) పరిశీలించి బ్లాక్‌స్పాట్‌లను ఖరారు చేస్తుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్‌స్పాట్లున్నాయి.
17 బ్లాక్‌స్పాట్లలో అండర్‌పాస్‌లు, జంక్షన్లు:
కటకమ్మగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, ఇనుపాముల వద్ద ఇరువైపులా లైటింగ్‌తో కూడిన సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే నవాబ్‌పేట్ జంక్షన్, ఆకుపాముల, కట్టంగూర్, దురాజ్‌పల్లి జంక్షన్‌ల వద్ద రోడ్ సైనేజెస్‌తోపాటు స్ట్రీట్ లైటింగ్‌తో కూడిన జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ చేయనున్నారు. రామాపురం క్రాస్‌రోడ్స్, కోమరబండ క్రాస్‌రోడ్, ముకుందాపురం, పెద్దకాపర్తి, చిట్యాల, చౌటుప్పల్, టేకుమట్ల, ఎస్వీకాలేజ్, జనగామ జంక్షన్ ప్రాంతాల్లో అండర్‌పాస్ (VUP) లు నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : టెన్త్ అర్హతతో 484 బ్యాంక్ జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!