Hyderabad News: షాకింగ్ ఘటన.. రోడ్డుపైకి వచ్చిన పెంపుడు కుక్కలు ఎంత పని చేశాయంటే?

హైదరాబాద్ లోని నిజాంపేటలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా రోడ్డుపైకి తన పెంపుడు కుక్కలను వదలడంతో అవి చెలరేగిపోయాయి. స్కూల్ లో ఉన్న పిల్లలకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్న ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో అతని చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Hyderabad News: షాకింగ్ ఘటన.. రోడ్డుపైకి వచ్చిన పెంపుడు కుక్కలు ఎంత పని చేశాయంటే?

కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కొన్ని చోట్ల వీధి కుక్కలు, మరికొన్ని చోట్ల పెంపుడు కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గత నెల 30న ఇస్నాపూర్ లో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చింపేసిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది. అదే రోజు ముత్తంగిలో మరో 8 ఏళ్ల చిన్నారిపై సైతం కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే గత పక్షం రోజుల్లో 9 కుక్కకాటు సంఘటనలు జరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం ఎక్కడో చోట కుక్కల దాడికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్ నిజాంపేట పరిధిలోని విజ్ఞాన్ స్కూల్ సమీపంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో చదువుతున్న తమ పిల్లలకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్లిన ఓ తండ్రిపైకి కుక్కలు తెగబడ్డాయి. రెండు పెంపుడు కుక్కలు, ఓ వీధి కుక్క తనపై దాడి చేశాయని బాధితుడు తెలిపారు.  ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా తన రెండు పెంపుడు కుక్కలను రోడ్డుపైకి వదిలాడని.. అవి తనపైకి దాడికి దిగాయని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే మరో వీధి కుక్క సైతం వాటితో కలిసి దాడి చేసిందన్నారు. ఈ ఘటనలో తన చేయి విరిగిందని.. తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చికిత్స కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని వెల్లడించాడు. ఈ విషయపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సీసీ కెమెరా విజివల్స్ ఉన్నా కూడా.. నిర్లక్ష్యంగా రోడ్డుపైకి కుక్కలను వదిలిన వ్యక్తిని ఇంత వరకు గుర్తించలేదన్నారు. తన స్థానంలో చిన్న పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. గతేడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్ బాగ్ అంబర్ పేటలో స్కూల్ విద్యార్థిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనను హైకోర్టు అప్పట్లో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. వీధి కుక్కులకు వ్యాక్సిన్ వేయడం లేదని, నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య సైతం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మానవీయ కోణంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీధి కుక్కల నివారణకు కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జీహెచ్‌ఎంసీ తదితరులను ఆదేశించింది. దీన్ని బట్టి రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ లో కుక్కల బెడద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు