గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలో ఇటీవలి జరుగుతున్న పరిణామాలతో ఢిల్లీ పెద్దలు ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ ఇవాళ(జులై 4) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సునీల్ బన్సల్ సమీక్షించనున్నారు. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తున్న వేళ.. సునీల్ బన్సల్ రెండు రోజుల పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ వార్తలు రావడం, మరోవైపు ఈ నెల 8న మోదీ వరంగల్ టూర్ ఉండడం, ఆ తర్వాత రోజు హైదరాబాద్‌లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ ఉండడంతో సునీల్ బన్సల్ నిర్వహించనున్న సమావేశంపై ఆసక్తి నెలకొంది.
అంతా అయోమయం.. గందరగోళం:
తెలంగాణ బీజేపీలో గ్రూపుల మధ్య నెలకొన్న గొడవలు రచ్చకెక్కాయి. నిన్నమొన్నటివరకు గ్రూప్ తగాదా ప్రచారాలను ఖండిస్తూ వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సైతం బహిరంగంగా, ట్విట్టర్ లేదా ఏదో ఒక పరోక్ష రూపాల్లో అసంతృప్తి గళం వినిపిస్తూండడం హైకమాండ్‌కి తలనొప్పిగా మారింది. ఇక అదే హైకమాండ్‌ని టార్గెట్ చేస్తూ పలువురు సీనియర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఈ పరిస్థితులు ఎప్పటినుంచో ఉన్నా.. హైకమాండ్ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అసంతృప్తిని చల్లార్చేందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర పార్టీలో సమన్వయానికి తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాష్, అరవింద్ మీనన్‌లను ఇన్‌చార్జిలుగా నియమించినా, వారెప్పుడూ పార్టీలోని అంతర్గత సమస్యలు, నేతల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

బండి సంజయ్ పదవిపై క్లారిటి వస్తుందా..?
ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో పార్టీ ఛీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని.. ఆయన అధ్యక్ష స్థానాన్ని ప్రస్తుత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి అప్పగిస్తారన్న కథనాలను ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారం జరిగిన ప్రతిసారీ తరున్ చుగ్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. మరికొందరు సీనియర్ నేతలు మాత్రం రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పుపై చర్చ జరుగుతున్న మాట నిజమేనంటున్నారు. ఇదంతా పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజన్‌లో పడేస్తోంది. బీజేపీలో నేతల మధ్య సయోధ్య లేదని జరుగుతున్న పరిణామాలను చూస్ ఎవరికైనా అర్ధమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిప్పులేకుండా పొగ రాదన్న విషయం అటు ప్రజలకు కూడా తెలుసంటున్నారు. తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో నిన్నమొన్నటివరకు బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటిదారుగా భావించిన బీజేపీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో నంబర్ త్రీ స్థానానికి చేరుకుందన్నది విశ్లేషకులు మాట. మరి చూడాలి పార్టీ హైకమాండ్ ఈ సమస్యలను ఎలా చక్కదిద్దుతుందో..చల్లార్చుతుందో..!