Human Trafficking: అంగట్లో అమ్మకాలు.. మానవ అక్రమ రవాణా.. కారణాలివే!

మానవ అక్రమ రవాణాకు ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయని 'హ్యుమన్‌ రైట్స్‌ కెరీర్స్‌' చెబుతోంది. పేదరికం, విద్య లేకపోవడం, చౌకగా కార్మికులను రిక్రూట్ చేసుకునే ముఠాలు పెరగడం, డిమాండ్‌ ఫర్‌ సెక్స్, సాంస్కృతిక అంశాలను ఈ లిస్ట్‌లో పెట్టింది.

New Update
Human Trafficking: అంగట్లో అమ్మకాలు.. మానవ అక్రమ రవాణా.. కారణాలివే!

వ్యభిచార కూపంలోకి నెడతారు.. వెట్టిచాకిరి చేయించుకుంటారు.. బానిసలుగా చూస్తారు.. రోడ్డుపై భిక్షం ఎత్తుకునేలా చేస్తారు.. ఇలా ఒకటేమిటి మానవ అక్రమ రవాణ బాధితుల బాధలు వర్ణణాతీతం..! ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రధాన సమస్య హ్యుమన్‌ ట్రాఫికింగ్‌. సైన్సు ఎంతో అభివృద్ధి చెందిన కాలంలో.. మార్స్‌పై మానవుడు అడుగులు మోపేందుకు ప్రయోగాలు జరుగుతున్న సమయంలోనూ మానవ అక్రమ రవాణా కొరలు చాచుతూనే ఉంది. ఈ సమస్య మూలాలను గుర్తించి దాన్ని రూపుమాపాల్సిన ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తుంటాయి. అధికారంలో ఎవరున్నా అంతే.. ఇది మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లోనూ ఇంతే..! అసలు మానవ అక్రమ రవాణాకి ప్రధాన కారణాలేంటి..?

publive-image ప్రతికాత్మక చిత్రం

1) పేదరికం:
పుట్టగానే కొంతమంది ధనవంతులు.. వాళ్లకి అన్ని సకలసౌకర్యాలూ ఉంటాయి.. మరికొందరికి మాత్రం పూర్తిగా భిన్నం. తిండికి, మంచినీరుకు కూడా నోచుకోని బతుకులు వాళ్లవి. పూట గడవడం కష్టంగా ఉండే వాళ్లు మన కళ్లముందే కనిపిస్తుంటారు. అలాంటివాళ్లని గుర్తించి నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. కానీ అధికారులు గుర్తించేలోపే హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వాళ్లని తమతో తీసుకుపోతుంది. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని.. విదేశాల్లో చదివిస్తామని మాయ మాటలు చెబుతుంది. చిన్నపిల్లలు.. యుక్త వయసులో ఉన్న ఆడవాళ్లని తమతో తీసుకుపోయి వ్యభిచార కూపంలోకి దింపుతుంది. పొట్ట కోసం.. అయిన వారి కోసం మనసును చంపుకోని బతికి ఉన్న శవంలా జీవించాల్సిన దుస్థితి దాపరిస్తుంది.

publive-image ప్రతికాత్మక చిత్రం

2) విద్య లేకపోవడం:
ఏది మంచో..ఏది మోసమో కనిపెట్టలేని వాళ్లు హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియాకి చిక్కుతారు. విద్య లేకపోవడంతో ఉద్యోగం రాదు అని.. తమతో వస్తే జాబ్‌ గ్యారెంటీ అని.. చదువుతో పని లేకుండా లక్షలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తామంటూ నమ్మబలుకుతారు. ఇంట్లో వాళ్లకి అవే మాయ మాటలు చెప్పి పిల్లలను తీసుకుపోతారు. తీరా విదేశాలకో..ఇతర రాష్ట్రాలకో పంపిన తర్వాత అక్కడ ఇళ్లలో పనిమనుషులుగా చేర్పిస్తారు. వాళ్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటారు.

publive-image ప్రతికాత్మక చిత్రం

3) చౌక కార్మికులు:
తక్కువ జీతానికి ఎక్కువ పని చేయించుకునే యాజమాన్యాలు మనకు నిజజీవితంలోనూ ఎదురవుతుంటాయి. మన ఫ్రెండ్స్‌లోనైనా ఇలాంటి శ్రమదోపిడి గురైన వాళ్లు ఉంటాయి. అయితే ఈ జాబ్‌ కాకపోతే వేరే జాబ్‌ మనేసే ఆప్షన్ చదువుకున్న వాళ్లకి..లేదా తమ సంబంధిత రంగాలపై పట్టు ఉన్నవాళ్లకి ఉంటుంది. మరి చదువుకోని వాళ్ల సంగతేంటి..? తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చిన్నతనం నుంచే బడికి దూరంగా ఉండే వాళ్లని కార్మికులగా ఇతర దేశాలకు లేదా ప్రాంతాలను తరలిస్తుంటారు. అది కూడా ఇల్లిగల్‌గా..! పోలీసులకు చెప్ప వద్దు అని.. ప్రతినెలా డబ్బులు బ్యాంక్‌ ద్వారా వేస్తామని తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి పిల్లలను నరకకూపంలోకి తీసుకువెళ్తారు. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో పని చేయించుకొని ఎంగిలి మెతుకులు పడేస్తారు. అటు చౌకగా కార్మికులు ఎక్కడ దొరుకుతారా అని కాపుకాచుకొని కూర్చునే వాళ్ల దగ్గరకు పిల్లలను పంపిస్తారు. చౌక కార్మికులగా..కుటుంబాలకు దూరంగా.. అసలు ఎలాంటి ఆధారం కానీ.. ఆధార్‌ కార్డు కాని లేకుండా జీవించాల్సిన దుస్థితి వస్తుంది. వీరంతా అక్రమ రవాణా బాధితులే..!

publive-image ప్రతికాత్మక చిత్రం

4) డిమాండ్‌ ఫర్‌ సెక్స్‌:
మానవ అక్రమ రవాణా ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ ఫర్‌ సెక్స్‌ అని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా.. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మాయిల మిస్సింగ్‌ కంప్లైంట్స్‌ వెనుక ఇదే మెయిన్‌ రీజన్‌గా తెలుస్తోంది. కడుపేదరికంలో కూరుకుపోయిన కుటుంబాలకు చెందిన బాలికలను వ్యభిచారంలోకి దింపేందుకు పెద్ద మాఫియానే రన్‌ అవుతుంది. అరబ్‌ దేశాలతో పాటు..మనదేశంలోనే ఉండేవాళ్ల కామ కోరికలు తీర్చేందుకు బాలికలను చిన్నప్పుడే తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేసి తీసుకుపోతారు. శరీర భాగాలను పెద్దగా చేసేందుకు సంబంధిత ఇంజెక్షన్లు ఇవ్వడంతో తక్కువ వయసులోనే యుక్త వయసు వారి లాగా కనిపించేలా చేస్తారు. ఇలా చిన్నతనంలోనే వాళ్లని సెక్స్‌ వర్కర్స్‌గా మార్చి మాధ్యవర్తులు డబ్బులు సంపాదిస్తారు. వాళ్లు అందంగా ఉన్నంత వరికే వాళ్లని చూసుకుంటారు. తర్వాత రోడ్డుపై భిక్షం ఎత్తుకోవడం..లేదా సంపనున్నల కుటుంబాల్లో పనిమనుషులుగా చేరడం తప్ప బాధితులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది.

publive-image ప్రతికాత్మక చిత్రం

5)సాంస్కృతిక అంశాలు:
సమాజంలో ఒకరు ఎక్కువ..మరికొందరు తక్కువ అనే భావం చాలా ఏళ్లుగా పెనవేసుకుపోయింది. ముఖ్యంగా కొన్ని కులాల్లోని మహిళలను కేవలం వ్యభిచార వృత్తి చేసుకునేవారిగా సమాజం చూస్తుండడం ఈనాటికి కొనసాగుతోంది. ఓవైపు చదువుకునే స్తోమత లేక.. తల్లిదండ్రులు తమని ఎందుకు కన్నారో అర్థంకాక.. సమాజం చూపిస్తున్న వివక్షను భరించలేక.. పారిపోయే బాలికలు ఎక్కువగానే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇలా సాంస్కృతిక అంశాలతో ఇతర ప్రాంతాలకు పారిపోయి..ఎవరి చేతుల్లోనూ నలిగిపోతున్న అమ్మాయిల సంఖ్య ఎంతో కూడా లెక్కలకి దొరకలేదు.

ఇలా కారణాలు ఏవైనా అక్రమ రవాణాకు గురైన వారితో భిక్షాటన చేయించి డబ్బు సంపాదించడం, వారిని హింసించడం, బాధించడం, కొన్ని సమయాల్లో అవయవాలను తొలగించి అమ్ముకొని వారిని దివ్యాంగులుగా మార్చి బిక్షాటన చేయించడం కూడా జరుగుతోంది. అవయవాలను తొలగించి అక్రమ వ్యాపారం చేస్తూ లొంగిపోయిన వారితో అక్రమ వ్యాపారాలను పెద్ద ఎత్తున చేయించి తప్పించుకునే ప్రయత్నం చేయడం కూడా ఇందులో ఒక భాగం. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరు ఏత్తనట్టు వ్యవరిస్తున్నయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఏదీ ఏమైనా మానవ అక్రమ రవాణా రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు.. సమాజానికి సంబంధించిన అంశం..ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు