LPG Cylinder Price : రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ కానుకను అందించింది. డొమెస్టిక్ సిలిండర్ల రిటైల్ ధరలో రూ.200 తగ్గింపును ప్రకటించడంతో పాటు, ఉజ్వల యోజనను విస్తరింపజేస్తూ, 75 లక్షల కుటుంబాలను ఇందులో జోడించారు నేటి (ఆగస్టు 30) నుంచి అమలు కానున్న ప్రభుత్వ ఈ నిర్ణయంతో 31 కోట్ల మందికి పైగా ఎల్‌పీజీ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
ఇందులో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న 9.6 కోట్ల మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఉజ్వల పథకం కింద సిలిండర్లు తీసుకునే వారు ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లపై రూ.400 తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉజ్వలతో అనుబంధంగా ఉన్న 9.6 కోట్ల మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఇప్పటికే సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని అందజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మీ ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..అప్రమత్తంగా ఉండండి.!!
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరందరికీ త్వరలోనే కనెక్షన్లు అందజేస్తామని తెలిపారు. మంగళవారం నాటి నిర్ణయం రిటైల్ ద్రవ్యోల్బణంలోనూ ఉపశమనం కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి చేరుకుంది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉందని, దానిని తగ్గించాలని సిఫారసు చేసింది. అందుకే భవిష్యత్తులో డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలు కావొచ్చు. సగటు ధర రూ.500కే సిలిండర్లు ఇస్తున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని వినియోగదారులకు అందజేస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అలా చేస్తే.., ఈ రాష్ట్రాల్లో సిలిండర్ మరో రెండు వందల రూపాయలు తగ్గుతుంది. లేకుంటే బీజేపీ దీన్ని అస్త్రంగా మార్చుకునే ఛాన్స్ ఉంది.
దీపావళికి ముందే పెట్రోల్, డీజిల్‌పై ధరలు తగ్గింపు?
దీపావళికి ముందు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది. గతేడాది మే నుంచి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గత రెండేళ్లుగా రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను చౌక ధరలకు పెద్దమొత్తంలో కొనుగోలు చేయడంతో పాటు ఎక్సైజ్ సుంకం కూడా ప్రభుత్వ ఖజానాకు బాగా దోహదపడుతుండడంతో చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఈ ఉపశమనం ఇవ్వవచ్చు.
ఇది కూడా చదవండి: రోజూ పిడికెడు వేరుశనగలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?