వరద బీభత్సం.. పూర్తిగా మునిగిపోయిన ఓరుగల్లు

ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకుల వణికిపోతుంది. వరుణుడు ఉగ్రరూపానికి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలో అయితే పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. వరద ధాటికి 17మంది గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

New Update
వరద బీభత్సం.. పూర్తిగా మునిగిపోయిన ఓరుగల్లు

ఐదు అడుగుల లోతులో వరద.. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షబీభత్సం కొనసాగుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. నగర వ్యాప్తంగా వందకు పైగా కాలనీలు వరద నీటితో ముంపునకు గురి అయ్యాయి. దీంతో సహాయకచర్యలు సరిగా అందక తమను పట్టించుకునేవారు లేరని ప్రజలు వాపోతున్నారు. నగరంలో మొత్తం 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని ముంపు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భద్రకాళీ దేవాలయానికి వెళ్లే దారిలో ఐదు అడుగుల లోతులో వరద ప్రవహిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు భవనాలు పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అటు భద్రకాళి దేవాలయం అన్నదాన సత్రంలో పరిసర కాలనీల వాసులు ఆశ్రయం పొందుతున్నారు.

వరదల్లో 17 మంది గల్లంతు.. 

గురువారం ఒక్కరోజే పలు ప్రాంతాల్లో 17మంది గల్లంతుఅయ్యారు. ఇప్పటివరకు 9మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. పస్ర-తాడ్వాయి మధ్య వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో వరంగల్‌-నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, కాలనీలు పూర్తిగా నీటి మునిగి జనం అవస్థలు పడుతున్నారు. హన్మకొండ జిల్లాలో అయితే భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నాయంనగర్‌లో రోడ్లు దెబ్బతినడంతో పలు చోట్ల రహదారులు కుంగిపోయాయి. వరద ధాటికి పెట్రోల్ పంప్ ధ్వంసమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని, చెత్తను సిబ్బంది తొలగిస్తున్నారు.

గ్రామస్తులకు సీతక్క భరోసా..

అటు ములుగు జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతుంది. ఏటూరునాగారంలో భారీగా వరద చేరింది. జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో కొండాయి, మాల్యాల గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. వాగు ఉధృతికి ఏడుగురు కొట్టుకుపోగా.. ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. డ్రోన్‌ కెమెరాలు, బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. తమను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గ్రామస్తులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సహాయచర్యలు వేగంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడి దారుణ పరిస్థితులను చూసి ఆమె ఆవేదనకు గురయ్యారు. ఇక దేవుడే ములుగుని కాపాడాలని తెలిపారు.

సహాయం కోసం వేడుకోలు.. 

నిర్మల్‌ జిల్లా భైంసాలోనూ భారీవర్షాలు, వరదల ధాటికి సిరాల చెరువు ఆనకట్ట తెగింది. దీంతో గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కట్టకు ఆనుకున్న ఉన్న రామస్వామి ఆలయం వరదల్లో కొట్టుకుపోయింది. భయంతో కట్టుబట్టలతో 200 మంది గ్రామం ఖాళీచేశారు. సిరాల గుట్టపై శివాలయంలో తలదాచుకుని తమను రక్షించాలని వేడుకుంటున్నారు. అయితే గ్రామంతా వరద చుట్టుముట్టడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు