దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సర్కార్ అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుందని తెలిపారు. ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం అని.. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం అని వ్యాఖ్యానించారు.
భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా.. కొండంత అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదు…ఒక విప్లవం అని తెలిపారు. ఓవైపు భ్రూణ హత్యలకు బ్రేక్ వేసిందని.. మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పెట్టిందని.. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అని పేర్కొన్నారు. పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గు క్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి.. కేసీఆర్ అని అన్నారు. మన అంగన్వాడీలను, ఆశా కార్యకర్తలను వెవట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి.. దేశంలోనే అత్యధిక పారితోషికాలు ఇచ్చి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదని.. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదని వ్యాఖ్యానించారు.