షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు.

వేడి వాతావరణంలో కాటన్ దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. ఇలా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ‌స్త్రాల‌ను ధ‌రించి వాకింగ్ చేస్తే మంచిది. వాకింగ్ చేస్తున్న‌ప్పుడు ఆయాసం వ‌స్తే కొంత సేపు విశ్రాంతి తీసుకుని మ‌ళ్లీ వాకింగ్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే గుండె జ‌బ్బులు ఉన్న‌వారు వాకింగ్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎమ‌ర్జెన్సీ ఫోన్ నంబ‌ర్ల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి.

ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తూ.. రోజుకు రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.