దేశం పేరు మారిస్తే ఎంత ఖర్చు అవుతుంది..?
కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరు మార్చబోతుంది అనేదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. తాజాగా విడుదల చేసిన జీ 20 ఆహ్వాన పత్రికలో ఇండియా స్థానంలో భారత్ అని ఉండడంతో ఈ చర్చ మొదలైంది. ఈ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ అఫ్ ఇండియాగా కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రస్తావించడంతో.. మోడీ ప్రభుత్వం దేశం పేరు మారుస్తుందని చెప్పకనే చెప్పినట్టయింది. అంతేగాక, పార్లమెంట్ సమావేశాల్లో.. దేశం పేరును మార్చే తీర్మానాన్నికూడా తీసుకొస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అసలు రాజ్యాంగంలో ఇండియా పేరును మార్చేందుకు వీలుందా..? ఇది సాధ్యమేనా..? ఇందుకోసం ఎలాంటి సాంకేతిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.. దీనికోసం ఎలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది.. దేశం పేరు మారిస్తే ఎంత ఖర్చు అవుతుంది..? ఇప్పుడు అందరికి వస్తున్న ప్రశ్నలు ఇవి.
ప్రత్యేక తీర్మానం అవసరం లేదు..
సాధారణంగా అయితే.. మనం ఇండియాని కొన్నిసార్లు భారత్ అని కూడా పిలుస్తాం.. అంతేగాక, ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే భారత్ అనే ఉంటుంది కూడా.. కానీ, ఆర్టికల్ 52 లో మాత్రం ప్రెసిడెంట్ ని.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే ఉంది.అయితే కేంద్రం జీ 20 ఆహ్వాన పత్రికలో..ఇండియా ప్లేస్ లో భారత్ అని ప్రస్తావించడంతో.. దేశం పేరును మార్చడం ఖాయమనట్టే అనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.అయితే, రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్.. భారత్ అంటే ఇండియా అని ఉండడంతో.. దీనికోసం ప్రత్యేక తీర్మానం అవసరం లేదని బీజేపీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అవసరమైన ప్రతి చోట పేరును మార్చాలి..
ఇవన్నీ పక్కన పెడితే.. ఒక దేశం పేరు మారిస్తే ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడమే గాక.. చాలా సమయం, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను... ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా..సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని సుప్రీం కోర్ట్ ఆఫ్ భారత్ గా మార్చాల్సి ఉంటుంది .. అంటే ఈ మార్పు అన్ని గెజిట్ నోటిఫికేషన్లలో చేయాల్సి ఉంటుంది. అంతేగాక కరెన్సీ నోట్లలోను మార్పు చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరమైన ప్రతి చోట పేరును మార్చాల్సి ఉంటుంది.
పేరు మార్చేందుకు రూ.14,300 కోట్ల ఖర్చు..
ఇప్పటికే కొన్ని దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయి. మన పొరుగు దేశమైన శ్రీలంక 1972లో పేరు మార్చుకుంది. అంతేగాక, ఆఫ్రికన్ దేశమైన స్వాజిలాండ్ 2018లో తన పేరును ఈస్వతినిగా మార్చుకుంది. అప్పుడు సౌత్ ఆఫ్రికా న్యాయవాది డారెన్ ఒలీవియా దేశం పేరును మారిస్తే అయ్యే ఖర్చును లెక్కించడానికి ఓఫార్ములా కనుక్కున్నాడు..ఇప్పుడు అదే ఫార్ములా మన దేశం విషయంలో యూజ్ చేస్తే.. పేరు మారిస్తే అయ్యే ఖర్చు దాదాపు 14,300 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే కొన్ని నగరాలు తమ పేర్లను మార్చుకున్నాయి. అలహాబాద్ పేరు ప్రయాగరాజ్ గా మార్చడానికి రూ.300 కోట్లకి పైగా ఖర్చు చేసారు. మరోవైపు ఔరంగాబాద్ గా ఉన్న నగరాన్ని ఛత్రపతి శంభాజీ నగర్ గా మార్చడానికి రూ.500 కోట్లు ఖర్చయింది.
విపక్షాల కూటమికి భారత్ పేరు పెడితే ఏం చేస్తారు..?
ఈ లెక్కన మన దేశం పేరు మార్చాలంటే దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే దేశం పేరు ఇప్పుడే ఎందుకు మారుస్తున్నారు అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, కేవలం ప్రతిపక్షాల కూటమి తమ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల కూటమి తమ కూటమికి మళ్లీ భారత్ అనే పేరు పెడితే అప్పుడేం చేస్తారు అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ వారు నీచరాజకీయాలు చేస్తున్నారు: ఖర్గే