- భర్త సంపాదన వెనక భార్య పరోక్ష కష్టం ఉందని కామెంట్
- కుటుంబ బాధ్యతలు చక్కబెట్టేది ఇల్లాలేనన్న కోర్టు
- మరణించిన భర్త ఆస్తిలో వాటా కోసం కోర్టుకెక్కిన భార్యకు అనుకూలంగా తీర్పు
భారతదేశంలో కుటుంబ వ్యవస్థలో భార్యల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించే చట్టం లేదని జస్టిస్ కృష్ణన్ రామసామి పేర్కొన్నారు. కుటుంబ ఆస్తులు సంపాదించడానికి భర్త పడే కష్టంలో భార్య పరోక్షంగా సహకరిస్తుందని చెప్పారు. ఇంటి పనులు, ఇంట్లో వాళ్ల బాధ్యతలను భార్య చక్కబెట్టడం వల్లే భర్త ఒత్తిడి లేకుండా పనిచేయగలడని అన్నారు. ఇంటి బాధ్యతల ఒత్తిడి లేకుండా చేస్తూ భర్త సంపాదనలో పరోక్షంగా భార్య కూడా భాగస్వామ్యం అవుతోందని వివరించారు. ఈ విషయంలో చట్టాలు లేకున్నా భార్య కష్టాన్ని ఈ కోర్టు గుర్తిస్తోందని జస్టిస్ కృష్ణన్ రామసామి చెప్పారు.
దశాబ్దాల పాటు కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ గడిపినా తన సొంతమంటూ చెప్పుకోవడానికి భార్యకు ఏమీ మిగలదని జస్టిస్ కృష్ణన్ రామసామి పేర్కొన్నారు. కుటుంబ సంక్షేమం కోసం భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా కష్టపడతారని, ఆస్తుల సంపాదనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇద్దరి శ్రమా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో మరణించిన భర్త పేరుతో ఉన్న ఆస్తుల్లో భార్యకూ సమాన వాటా ఇవ్వాలని జస్టిస్ కృష్ణన్ రామసామి తీర్పు వెలువరించారు. అమ్మాళ్ అనే గృహిణి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెలువరించారు.