మణిపూర్‌లో సామూహిక ఖననంపై హైకోర్టు స్టే

కొంతకాలంగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఆందోళనల్లో మృతిచెందిన మృతదేహాలను సామూహిక ఖననం చేయడంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న యథాస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
మణిపూర్‌లో సామూహిక ఖననంపై హైకోర్టు స్టే

సామూహిక ఖననం వాయిదా..

రెండు వర్గాల మధ్య మణిపూర్‌లో జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 35 మంది మృతదేహాలను ఖననం చేయడంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కుకీజోమి వర్గానికి చెందిన గిరిజన నాయకుల ఫోరం సామూహిక ఖననానికి సిద్ధమైంది. అయితే ఈ చర్యపై విచారణ చేపట్టిన మణిపూర్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక ఖననానికి నిర్దేశించిన ప్రాంతంలో ప్రస్తుతమున్న యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. హైకోర్టు తీర్పుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యర్థన మేరకు ఐదు రోజుల పాటు మృతదేహాల ఖననం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు గిరిజనుల నాయకుల ఫోరం(ITLF) తెలిపింది.

భారీగా చేరుకున్న ప్రజలు..

మృతదేహాలను ఖననం చేసేందుకు తాము ఎంచుకున్న స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించింది. మిజోరం సీఎం సైతం ఇదే విషయంపై మమ్మల్ని అభ్యర్థించారని తెలిపింది. దీంతో తాము కూడా దీనిపై ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని పేర్కొంది. దీనికి ముందు చురాచంద్‌పుర్ జిల్లా హవోలై ఖోపి ప్రాంతంలో గత మూడు నెలలుగా జరుగుతున్న అల్లర్లలో మరణించిన కుకీజోమి వర్గానికి చెందిన 35 మందిని సామూహిక ఖననం చేయనున్నట్టు ఐటీఎల్‌ఎఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాయకుల పిలుపుతో ఆ వర్గానికి చెందిన ప్రజలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు.

అదనపు బలగాలు మోహరింపు.. 

దాంతో అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది. అయితే బిష్ణుపుర్ జిల్లాలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి సామూహిక ఖననం చేసే ప్రాంతానికి చేరుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ ఇంఫాల్ ప్రాంతంలో కర్ఫూను తిరిగి అమలు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు.

అంతకుముందు సామూహిక ఖననంపై హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో చనిపోయినవారి మృతదేహాల అంతిమ సంస్కారాల పరిశీలిస్తున్నామని పేర్కొంది. శాంతి, మత సామరస్యాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. ఏడు రోజుల వ్యవధిలో అన్ని పార్టీలు, వర్గాలు సంతృప్తి చెందేలా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా కృషిచేస్తామని ప్రకటనలో వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు