మృతుల కుటుంబాలకు భరోసా..
ఇటీవల నరసరావుపేటలో మృతిచెందిన అభిమానుల కుటుంబసభ్యులను హీరో సూర్య(Hero Suriya)వీడియో కాల్‌లో పరామమర్శించారు. అనంతరం అండగా ఉంటానని.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. అయితే మృతుల్లో ఒకరైన పోలూరి సాయి సోదరి అనన్య తాను డిగ్రీ చదివానని ఉద్యోగం ఇప్పించాలని కోరారు. దీంతో తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని ధైర్యం చెప్పారు. సోదరుడి మృతికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సోదరి ఆరోపించారు.
ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్‌తో మృతి..
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయారు. మృతులు నక్కా వెంకటేష్, పోలూరు సాయి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఫ్లెక్సీకి ఉన్న ఇనుప రాడ్‌కు ఓవర్‌హెడ్ విద్యుత్ వైరు తగలడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అండగా ఉంటారనుకున్న కొడుకులు ఇలా అర్థాంతరంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తెలంగాణ అభిమాని మృతిపైనా సంతాపం..
గతంలోనూ తెలంగాణకు చెందిన అభిమాని తాటికొండ ఐశ్వర్య హఠాన్మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తంచేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మాల్‌లో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య మృతి చెందింది. ఐశ్వర్య మృతికి సంతాపం తెలియజేస్తూ ఆమె తల్లిదండ్రులు అరుణ, నర్సిరెడ్డిలకు లేఖ రాశారు. ‘ఐశ్వర్య పుట్టినరోజున స్వయంగా శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నా. కానీ ఇలా సంతాపం సందేశం పంపడం బాధాకరం. నీ అభిమానం పొందడం అదృష్టంగా భావిస్తున్నా’అని అందులో పేర్కొన్నారు.
ఆకట్టుకుంటోన్న 'కంగువా' మూవీ గ్లింప్స్..
ప్రస్తుతం సూర్య 'కంగువా'(Kanguva movie) అనే భారీ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. 14వ శతాబ్దం నాటి కథతో రూపొందిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాతో పాటు యువీ క్రియేషన్స్ అధినేతలు నిర్మిస్తున్నారు. తమిళ ప్రముఖ డైరెక్టర్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్య లుక్, నటనపై ప్రశంసలు వస్తున్నాయి.