లక్కీభాస్కర్‌గా దుల్కర్..
మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సీనియర్ హీరో మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక తెలుగు డబ్ సినిమాలతో పాటు 'మహానటి', 'సీతారామం' వంటి డైరెక్ట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. దీంతో ఆయనకు తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. శుక్రవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా మరో తెలుగు సినిమాను అధికారికంగా ప్రకటించాడు. వెంకీ ఆట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' అనే సినిమా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ ప్రీ లుక్ లో వంద రూపాయల పాత నోటు వెనక దుల్కర్ నవ్వుతూ ఉన్నాడు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తెలుగులోనూ మంచి ఫాలోయింగ్..
దర్శకుడు హనూ రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' చిత్రం గతేడాది విడుదలైన మంచి విజయం సాధించింది. ఇందులో దుల్కర్ నటన ఆకట్టుకోగా.. హీరయిన్ మృణాల్ ఠాకూర్ హావభావాలు యువతను కట్టిపడేశాయి. డిసెంట్ ప్రేమ కథగా ఈ మూవీ నిలిచింది. ఇందులోని పాటలు చార్ట్ బాస్టర్‌గా నిలిచాయి. అంతకుముందు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన 'మహానటి' సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. జెమినీ గణేషన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ రెండు సినిమాలతో తెలుగులోనూ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.
మరోసారి పరాయిభాష నటుడితో..
ఇక దర్శకుడు వెంకీ అట్లూరి విషయానికొస్తే.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'తొలిప్రేమ' చిత్రంతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చాడు. అనంతరం అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ', నితిన్‌తో 'రంగ్ దే' చిత్రాలు తీశాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ.. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో 'సార్' మూవీ తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి పరాయిభాష నటుడితో చిత్రం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.