ధవళేశ్వరంలో భారీగా పెరిగిన నీటిమట్టం..
భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో వరదప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. లోతట్టు ప్రాంతాలకు నీటిని అధికారులు విడుదలచేయడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వశిష్ట, వైనతేయ నదిపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి లంక వద్ద గౌతమి కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో రోజువారీ రాకపోకల కోసం పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
ముంపు గ్రామాల్లో హైఅలర్ట్..
ధవళేశ్వరం దగ్గర వరద రెట్టింపు కావడంతో గోదావరి ముంపు గ్రామాల్లో హైఅలర్ట్ విధించారు. కూనవరం దగ్గర శబరి నది ఉధృతం ప్రవహిస్తుండడంతో పుష్కర్ ఘాట్ దగ్గర 51 అడుగులకు నీరు చేరింది. దీంతో హెచ్చరికగా అడ్డంగా కర్రలను సిబ్బంది అమర్చారు. క్రమంగా వరద ఉధృతి పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.. స్నానాల ఘాట్ల దగ్గర పర్యాటకులకు అనుమతి నిషేధించారు. చింతూరు ఏజెన్సీలో ఇంకా 30 గ్రామాలకు రాకపోకలు కొనసాగటం లేదు. ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం 10.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా.. 7,96,836 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి దిగువకు అధికారులు విడుదల చేశారు.
అత్యవసరమైతేనే బయటకు రండి..
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంత వాసుల్లో తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. అవసరమైతేనే బయటికి రావాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమాచారం అందింంచేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటుచేశారు. వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించారు.