కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Rains) ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరాయి. దీంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ ప్రభుత్వాధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలు, కొన్ని కార్యాలయ సంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేఉరి, అలప్పుజాలోని చేర్యాల, చెంగన్నూర్ వంటి ప్రాంతాల్లో విద్యా సంస్థలకు జిల్లా యంత్రాంగం ముందుగానే సెలవులు ప్రకటించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 17 సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం నాలుగు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలేవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.