తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు,మూడు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు ప్రమాదకరస్థితికి చేరుకుంది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఏక్షణం ఏం జరుగుతుందోనని తెలియన పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పొంగిప్రవహిస్తోంది. ప్రస్తుతం 50 .3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. దిగువకు 12,65,653 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వరద గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తాలిపేరు వాగు కూడా పొంగిప్రవహిస్తుంది.25 గేట్లు పూర్తిగా ఎత్తి 123638 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. భద్రాచలం ,దుమ్ముగూడెం, చర్ల ,వెంకటాపురం ,వాజేడు ప్రాంతాలకు లంకగ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.
ఇటు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం 22 అడుగులకు చేరుకుంది..మరింత పెరిగే అవకాశం ఉందని.. కలెక్టర్ విపీ గౌతమ్ అన్నారు. మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు కలెక్టర్. 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీచేశారు. అర్ధరాత్రి దాటాక వరద పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు. నాయబజార్ కళాశాల,స్కూల్ తో పాటు ఉమేన్స్ డిగ్రీ కళాశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఇక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. 14గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా...ప్రస్తుత నీటిమట్టం 697.800 అడుగులు చేరుకుంది. ప్రాజెక్ట్ సామర్ధ్యం:7.603 టీఎంసీ లకు గాను ప్రస్తుతం7.039గా కొనసాగుతోంది.ఇన్ ఫ్లో 387583 క్యూసెక్ లు ప్రాజెక్టులోకి వస్తుండగా. ఔట్ ఫ్లో 218922 క్యూసెక్కులు నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలుప్రాంతాలకు చెందిన ప్రజలు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. సెంట్రల్, ఈస్ట్ ,వెస్ట్ జోన్ పరిధిలో పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ముత్యందార రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయినట్లు జిల్లా ఎస్ పి గౌష్ ఆలం తెలిపారు. అడవిలో చిక్కుకున్న 80 మంది సందర్శకులను సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో విరభద్రవరం లొ గల ముత్యం దార జలపాతం వీక్షించేందుకు బుధవారం 80 మంది అడవిలోకి వెళ్ళగా తిరుగు ప్రయాణంలో వాగు ఉధృతి పెరగడంతో దాటలేక అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు కు చెందిన వారు. భయభ్రాంతులకు గురైన వారు వెంటనే డయల్ 100 కు ఫోన్ చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్,NDRF బృందాలను, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎట్టకేలకు 80 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుండి బయటకు రావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.