Rains Update: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతుంది. రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు అవసరం ఉంటే బయటకు రావొద్దని వాతావరణశాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు , ఏపీలోనూ గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, పడమటి గాలుల ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అయితే మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 29న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం అది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి, తీవ్రతరమవుతుంది అధికారులు చెబుతున్నారు.