జూరాల ప్రాజెక్ట్ 31గేట్లు ఎత్తివేత..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి 2 లక్షల 15 వేల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 31 గేట్లు ఎత్తివేసి 2 లక్షల 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 కాగా, ప్రస్తుత నేటి సామర్థ్యం 7.426 పూర్తిస్థాయి నీటి మట్టంగా ఉంది. ఎగువ నుంచి మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో మరికొన్ని గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. కృష్ణా నది ప్రవాహం తీవ్రత పెరగనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిజాంసాగర్ 6గేట్లు ఎత్తివేత..
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లలో 6 గేట్లు ఎత్తి దిగువ మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు జలాశయంలోనికి 45 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను17.311 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,08,000 క్యూసెక్యులు.. 26 గేట్ల ద్వారా గోదావరిలోకి ఔట్ ఫ్లో 1,08,000 క్యూసెక్యులు విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులతో 83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులతో 90 టీఎంసీల సామర్థ్యం ఉంది.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక..
ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వరద ప్రభావం ఏర్పడింది. 30 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు మండలాల్లో 2000కు పైగా కుటుంబాలను సురక్షిత కేంద్రాలకు అధికారులు తరలించారు. మరోవైపు రహదారులపైకి భారీగా వరద చేరుతుండడంతో భద్రాచలం నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. విజయవాడ, జగ్ధల్‌పూర్ జాతీయ రహదారిపై నీరు చేరడంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని మూసివేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దు కావడంతో సరుకు రవాణా భారీగా నిలిచిపోయింది.