Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 29 మధ్యాహ్నం 2.15గంటలకు విచారణను వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఇదే కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్‌ను ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ కూడా ఈనెల 29న జరిగే అవకాశం ఉంది.
ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకట నారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో క్వాష్ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర బెయిల్ అనేది రెండో అభ్యర్థన అని లూథ్రా తెలిపారు. 17ఏ కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశం ఉందని అభిప్రాయపడ్డారు. జడ్ క్యాటరిగీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని వాదించారు. లూథ్రా వాదనలు విన్న సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.