/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-jpg.webp)
విజయవాడలోని మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి అహ్వానించారు. ఈ సదర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో రమేష్‌కు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఏపీ అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తాను జైలుకు వెళ్లేందుకు, దెబ్బలు తినేందుకైనా సిద్ధంగా ఉన్నానన్నారు.
అలయన్స్ మీటింగ్ కోసం తాను ఢిల్లీ వెళ్లానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనను వారం క్రితమే బీజేపీ పెద్దలు పిలిచారని కానీ తాను వారాహీ యాత్రలో ఉన్నందున వెళ్లలేకపోయానన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వంతో తనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని జనసేన అధ్యక్షుడు వెల్లడించారు. తనకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి నిరాధార వార్తలకు ప్రాధాన్యత ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రధానితో తనకున్న అనుబంధం చాలా బలమైందని, ఆ అనుబంధం ప్రజలకు, ఏపీ ఆర్థిక పరిపుష్టికి సంబంధించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు పటిష్టమైన భవిష్యత్‌ను ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిని కోరినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. జగన్ పోవడానికి ఎన్డీయే రావడం ఒక్కటే పరిష్కారమన్నారు. తాను కోరుకుంటే సీఎం పదవి రాదన్న పవన్.. ప్రజలు కోరుకుంటే తనకు సీఎం పదవి వస్తుందన్నారు. జగన్‌తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపంలేదని, తాను పోరాటం చేస్తుంది జగన్ సర్కార్ దాష్టీకం మీదే అని జనసేన అధినేత తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో కొండలను దోచుకుంటున్నారన్న పవన్.. వైసీపీ వాళ్లు కొండలను ఉంచరు, దోచేస్తారని తాను ఏప్పుడో చెప్పానని గుర్తు చేశారు. ఈ స్థాయిలో ఉన్న దోపిడీ కబ్జాలు ఇంతకు ముందు లేవని, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు భూమి మిగల్చకుండా చేస్తారని మండిపడ్డారు.