హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మసీదుల్లో ప్రార్థనలు నిషేధం

హర్యానా రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు వర్గాలు మధ్య జరిగిన అల్లర్లలో ఇప్పటికే ఆరుగురు మృతిచెందారు.

హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మసీదుల్లో ప్రార్థనలు నిషేధం
New Update

హర్యానా రాష్ట్రం మండిపోతోంది. నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మసీదుల్లో మత ప్రార్థనలను ప్రభుత్వం నిషేధించింది. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉండే నుహ్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేయవద్దని, ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అల్లర్లు జరిగాయని హర్యానా హోం మంత్రి అనిల్ తెలిపారు.

అల్లర్లకు కారణమైన గోరక్షకుడు మోను మనేసర్‌ను అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కానీ ఇందుకు రాజస్థాన్ సీఎం సహకరించడం లేదనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నుహ్ హింసకు సంబంధించి నమోదైన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అల్లర్లు జరిగినప్పుడు ప్రజలు ఎవరైనా వీడియో తీస్తే స్థానిక పోలీసులకు అందజేయాలని కోరారు. జర్నలిస్టులు కూడా తమ వద్ద ఉన్న వీడియో ఫుటేజీలు, ఫొటోలను ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. హింస చెలరేగే ముందు అందిన ఇంటెలిజెన్స్ సమాచారంపైనా సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సమాచారం ఎవరికి అందింది.. ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలపై విచారణ జరుగుతుందన్నారు. హింసకు సంబంధించిన వీడియోను అదనపు ప్రధాన కార్యదర్శికి పంపినట్లు పోలీసు అధికారి చెప్పిన దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. మోను మనేసర్‌ను అరెస్టు చేసేందుకు హర్యానాకు వచ్చిన రాజస్థాన్ పోలీసులను ఎవరూ అడ్డుకోలేదని స్పష్టంచేశారు.

హర్యానాలోని ముస్లింలు అధికంగా ఉండే నుహ్ జిల్లాలో జూలై 31న విశ్వహిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మత గురువుతో సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. అనేక వాహనాలు, దుకాణాలకు అల్లరి మూక నిప్పు పెట్టారు. గురుగ్రామ్ జిల్లాలో నిరసనకారులు 5 గోడౌన్లకు నిప్పు పెట్టారు. మరో రెండు దుకాణాలను ధ్వంసం చేశారు. గురుగ్రామ్‌లో ఇంకా కాల్పులు, విధ్వంసాలు కొనసాగుతున్నందున కేంద్ర బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 176 మందికి పైగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నుహ్, గురుగ్రామ్, ఇతర ప్రభావిత జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. ఘర్షణలకు సంబంధించి వేల వీడియోలను పరిశీలిస్తున్నామని, ప్రజలను రెచ్చగొట్టే వీడియోలను పోస్ట్ చేసిన మూడు ఖాతాలను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. హింసాత్మక ప్రాంతాలలో అన్ని మసీదుల వద్ద శాంతిభద్రతల దృష్ట్యా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe