Palnadu History: పౌరుషాల గడ్డ.. పల్నాడు నెత్తుటి కథ!

ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు ప్రాంతం రక్తసిక్తమైంది. ఏకంగా ఎమ్మెల్యేలు, అభ్యర్థులపైనే దాడులు జరిగే పరిస్థితి ఏర్పడింది. కొడవళ్లు లేచాయి.. నాటు తుపాకులు పేలాయి. అయితే.. పల్నాడుకు ఇలాంటి ఆందోళనలు ఇప్పుడు కొత్త కాదు. ఈ ప్రాంత నాటి నెత్తుటి కథను ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update
Palnadu History: పౌరుషాల గడ్డ.. పల్నాడు నెత్తుటి కథ!

ఓ అమ్మాయి ఏడుపు ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది.. మా నాన్నను చంపోద్దని ఆమె బతిమాలడుతోంది.. అయితే ఆ అమ్మాయి వేదన, ఆవేదన వారికి పట్టలేదు. ఎదనిండా హింసను పులుముకొని ఉన్న ఓ వర్గం ఆమె నాన్నను కత్తులతో కడతేర్చింది.. ఇది జూన్ 26, 1987నాటి ఘటన. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని దేచవరం గ్రామంలో జరిగిన యదార్థ గాథ ఇది. దశబ్దాలు కాదు, శతాబ్దాలూ కాదు.. వేల సంవత్సరాల నాటి నుంచి పల్నాడులో జరుగుతున్న హింసా, హత్యలు, దోపిడీ, ఆస్తుల ధ్వంసం ఈనాటికి కొనసాగుతోంది. 2024 ఏపీ ఎన్నికల పోలింగ్‌ సమయంలోనూ పల్నాడు రక్తమోడింది. కొందరి తలలు పగిలాయి.. మరికొందరి చేతులు విరిగాయి.. దీంతో పల్నాడు మళ్లీ పాత రోజులను గుర్తుకు తేస్తోంది. అసలు పల్నాడులో ఇంతటి రక్తపాతానికి, ఫ్యాక్షన్‌ గొడవలకు కారణమేంటి? పల్నాడులో పరిస్థితులు ఎందుకిలా ఉంటాయో అర్థం చేసుకోవాలనుకుంటే గతాన్ని తెలుసుకోవాల్సిందే. 12వ శతాబ్దాం నాటి పల్నాటి యుద్ధం నుంచి కోడెల శివప్రసాద్‌ ఎపిసోడ్‌ వరకు అంతా అర్థం చేసుకోవాల్సిందే!

2019లో ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను పల్నాటి పులి అని ఆయన మద్దతుదారులు పిలుస్తుంటారు. 1980వ దశకంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇచ్చిన పిలుపుతో కోడెల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన ఎంట్రీ సమయానికే పల్నాడు ఫ్యాక్షనిజం కారణంగా హింసను చూస్తుంది. గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న లక్ష్యంతో వైద్య వృత్తిని వదలిపెట్టిన కోడెలకు రెడ్డి కులం పెద్దలతో వైరం పెరిగింది. 1987 జూన్‌లో రెడ్డి కులం వారి ఇళ్లు, ఆస్తులను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. వారి ఇళ్లపై బాంబులు కూడా వేశారు. ఒక వ్యక్తిని తన కుమార్తె చూస్తుండగానే చంపేశారు. ఈ దాడిలో కోడెల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు ఎక్కడా ప్రస్థావించలేదు.

1999 సార్వత్రిక ఎన్నికల్లో కోడెల సిట్టింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఆయన మద్దతుదారులు నలుగురు చనిపోవడం పెను దుమారానికి కారణమైంది. ఇది సీబీఐ విచారణకు దారితీసింది. విపక్షాలు, మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని కోడెల ఆరోపించారు. అయితే ఈ కేసు ఎటూ తేలలేదు. ఈ ప్రాంతంలో కోడెలకు ఉన్న బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎన్నో వివాదాలతో ఆయన రాజకీయం జీవితం చివరకు తలకిందులైంది. 2019 ఎన్నికల సమయంలో ఏపీ స్పీకర్‌గా ఉన్న కోడెలపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగిపోవడం సంచలనం రేపింది.

పల్నాడులోని వివిధ ప్రాంతాల్లో ఓవైపు కోడెల ఎపిసోడ్‌లో కమ్మ వర్సెస్ రెడ్డిగా ఉన్న యుద్ధాలు కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు రెడ్డి వర్సెస్ రెడ్డి ఫ్యాక్షన్‌ గొడవలు రక్తపాతాన్ని సృష్టించాయి. 2001 మార్చి 10న దుర్గి సమీపంలో కొందరు దుండగులు ఏడుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపారు. ఈ ఘటనలో జూలకంటి సాంబిరెడ్డి సహా అతని అనుచరులను హత్యకు గురయ్యారు. ఇది జరగాడానికి ముందు సాంబిరెడ్డి వర్గం హనిమిరెడ్డిని హత్య చేసినట్టుగా చెబుతుంటారు. ఈ ప్రతీకార దాడి వెనుక జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రహ్మారెడ్డి 2024 ఎన్నికల్లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

నిజానికి పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ ప్రభావం తక్కువగానే ఉంటుంది.
మాచర్ల కేంద్రంగానే హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి మండలాల్లోని గ్రామాల్లో 2019లోనూ ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మాచర్ల నియోజకవర్గంలో వందల కుటుంబాలు తమ గ్రామాలు ఖాళీ చేశాయి. ఓడిపోయిన వర్గాన్ని సపోర్ట్ చేసినవారు ఊరొదిలి వెళ్లిపోయారు. ఇది ప్రతీసారి జరిగే విషయంగానే కనిపిస్తోంది. ఆ ఊర్లో ఎవర్ని కదిలించిన ఏదో ఒక వర్గవ వైపు వాదిస్తూనే ఉంటారు. 2024 ఏపీ ఎన్నికల పోలింగ్‌ వేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం, బ్రహ్మారెడ్డి వర్గం పరస్పర దాడులు చేసుకున్నాయి. దీంతో పల్నాడు మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. రక్తం తాగి నిప్పురవ్వలు చిమ్మే ప్రాంతంగా కనిపిస్తోంది.

నిజానికి పల్నాడు చరిత్ర ఫ్యాక్షనిజంతో చెడిపోయి శతాబ్దాలు దాటింది. ఒకసారి క్రీ.శ.1185 నాటి రోజులకు వెళ్దాం.. కారెంపూడిలో నాగులేటి ఒడ్డున మహా సంగ్రామం జరిగిన కాలమది. ఆనాడు పల్నాడు పాలకుడైన నలగామ పిలుపుకి స్పందించి కాకతీయులు, హోయసల, కోట, కాలచూరి, వెలనాటి చోడులు యుద్ధంలో పాల్గొన్నారు. మూడురోజుల్లో ముగిసిన యుద్ధంలో పెద మలిదేవుడు పక్షం ఓడిపోయింది. తనవారందరూ మరణించడంతో విరక్తి చెందిన బ్రహ్మనాయుడు పలనాడుని శాశ్వతంగా విడిచిపెట్టి వనవసానికి వెళ్ళిపోయాడట. ఇది మహాభారత కథను తలపిస్తుందని అక్కడివారు చెబుతుంటారు.

పల్నాడు ప్రాంతంలో అత్యధిక హింసకు ప్రధాన కారణం వెనుకబాటుతనంగా చెబుతుంటారు సామాజికవేత్తలు. విద్య, ఉద్యోగాల కంటే ఫ్యాక్షన్‌ గొడవలకే అక్కడి వారు ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణంగా విశ్లేషిస్తుంటారు. ఈ రాజకీయ ఘర్షణలు, కుల పిచ్చి, ఫ్యాక్షనిజం కారణంగా ఎక్కువగా నష్టపోయేది అణగారిన వర్గాలకు చెందిన వారేనని మీడియా సంస్థ 'ది న్యూస్‌ మినిట్‌' రిపోర్ట్ చేసింది. వర్గ ఆధిపత్యపోరులో తమ వర్గం నాయకుడికి రాజకీయ హోదా కట్టబెట్టాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు ప్రవేశం చేస్తాయి. ఒక్కో వర్గం ఒక్కో రాజకీయ పార్టీని ఆశ్రయించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. పల్నాడు నెత్తుటి కథ కూడా ఇదే నిజమని చెబుతోంది.

Advertisment
తాజా కథనాలు