TSPSC Group 2 Exam: పేపర్ లీకేజీ తరువాత తిరిగి గ్రూప్ 2 ఎగ్జామ్ ను నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ (TSPSC) ముమ్మర కసరత్తు చేస్తోంది. పరీక్షల నిర్వహణ, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, గ్రూప్ 1, గ్రూప్ 4 పరీక్షల ఫలితాలు, గ్రూప్ 3 పరీక్ష తేదీ ఖరారు, కోర్టు కేసులపై టీఎస్పీఎస్సీ కమిషన్ వర్కౌట్ చేస్తోంది. అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలపై ఈ వారంలోనే హైకోర్టు కేసు ఓ కొలిక్కి వస్తే బాగుంటుందని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.
కోర్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఫలితాలను వెల్లడించాలని అనుకుంటోంది. గ్రూప్ 4 ఓఎమ్మార్ షీట్ల (TSPSC Group 4 OMR Sheets) స్కానింగ్ పూర్తయినందున వారం, పదిరోజుల్లో కీ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఆ తరువాత అభ్యతరాలకు వారం గడువు ఇవ్వనున్నారు. నిపుణుల కమిటీతో చర్చించి, ఫైనల్ కీ ఇస్తారు.
ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్ ఇవ్వాలనే విషయంపై చర్చిస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పై కమిషన్ లో కీలకంగా చర్చించినట్టు సమాచారం. అయితే గ్రూప్ 2 నిర్వహణపై (TSPSC Group 2 Exam) ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో ఛైర్మన్ జనార్దన్ రెడ్డి పలు సమావేశాలు నిర్వహించారు.
పరీక్ష నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కూడా దాదాపుగా పూర్తయింది. మరో వైపు ఈ తేదీల్లో పరీక్ష్ కేంద్రాలకు విద్యాశాఖ సెలవు కూడా ప్రకటించింది. అయితే ఇప్పటికే పేపర్ లీకేజీ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీకి గ్రూప్ 2 ఎగ్జామ్ ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించడమనేది కత్తి మీద సామే.
TSPSC Official Website: www.tspsc.gov.in