Khammam: కోడలికి మాయమాటలు చెప్పి తన సొంత మనవడిని అమ్మేసింది ఓ నానమ్మ. అసలు విషయం తెలుసుకున్న కోడలు.. తన కొడుకు విషయంపై పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
మాయమాటలు చెప్పి..
2021లో నిజాంపేటకు చెందిన స్వప్న అనే యువతి ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన సాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ఈ దంపతులకు బాబు యశ్వంత్ జన్మించాడు. అయితే, ఓ రోడ్డు ప్రమాదంలో సాయి దుర్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో కోడలు స్వప్నను వేరొక వివాహం చేసుకోవాలని మనవడు యశ్వంత్ ఆలనాపాలనా తాను చూసుకుంటానని అత్త నాగమణి మాయమాటలు చెప్పింది.
Also Read: మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్
బిడ్డపై మమకారంతో..
అత్తమాటలు నమ్మిన కోడలు స్వప్న బిడ్డ యశ్వంత్ ను తన అత్తకు ఇచ్చింది. అయితే, 21 నెలల యశ్వంత్ ను తల్లికి తెలియకుండా నానమ్మ నాగమణి వేరొకరికి విక్రయించింది. ఇటీవల యశ్వంత్ ను ఓ సారి చూపించాలని కోడలు స్వప్న అత్తను కోరింది. ఎంత అడిగినా బిడ్డను చూపించకపోవడంతో అనుమానంతో అత్తను నిలదీసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రూ. 5 లక్షలకు..
హైదరాబాద్ లో రూ. 5 లక్షలకు తన బిడ్డను వేరొకరికి అత్త విక్రయించిందని తెలుసుకున్న స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నానమ్మ నాగమణి మనవడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది. పోలీసులు నాగమణి వద్ద నుంచి బాబును తీసుకుని సీడీపీవో అధికారులకు అప్పగించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. అయితే, తల్లి స్వప్న మాత్రం బాబును తనకు అప్పగించాలని వేడుకుంటోంది.