Health Ministry: భారత కేంద్ర ప్రభుత్వం ఫార్మా స్యూటికల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. 156 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ లను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది కూడా14 ఎఫ్‌డీసీలపై నిషేధం విధించిన విషయం గురించి తెలిసిందే. తాజాగా 156 మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది.
వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణలు, మల్టీ విటమిన్లు కూడా ఉన్నాయి. ఈ మందులు ఆరోగ్యానికి ప్రమాదకరం గా నిర్ధారణ అవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధాల ఉత్పత్తి, విక్రయం, పంపిణీని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) కలయికతో తయారైన మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
వీటిలో యాంటీబయాటిక్స్, అలెర్జీ మందులు, నొప్పి నివారణలు, మల్టీవిటమిన్లు, జ్వరం, అధిక రక్తపోటు కోసం ఇచ్చే మందులు కూడా ఉన్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నోటిఫికేషన్‌లో, ‘కేంద్ర ప్రభుత్వం, డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నియమించిన నిపుణుల కమిటీ ఈ అంశంపై దర్యాప్తు చేపట్టింది. ఈ ఎఫ్‌డీసీలలో ఉండే పదార్థాలకు వైద్యపరమైన సమర్థన లేదని సిఫార్సు చేశారు.’ అని వివరించారు.
నిషేధ జాబితాలోకి చేరిన మందులలో మెఫెనామిక్ యాసిడ్, పారాసిట్మాల్ ఇంజెక్షన్ కలయిక ఉంటుంది. ఇది నొప్పి, వాపు తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదనంగా, ఒమెప్రజోల్ మెగ్నీషియం, డైసైక్లోమైన్ HCl కలయిక కూడా చేర్చడం జరిగింది. ఈ కలయిక కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఫార్మాస్యూటికల్ కంపెనీల వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. దీని వల్ల రోగులకు తక్కువ ప్రయోజనం, ఎక్కువ నష్టం జరుగుతుందని వివరించింది.
అందుకే, ప్రజా ప్రయోజనాల కోసం ఈ మందుల ఉత్పత్తి, అమ్మకం, పంపిణీని నిషేధించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A ప్రకారం ఈ నిషేధం విధించడం జరిగింది.
Also Read: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కు మరో స్టాప్!