Governor Tamilisai: సవాళ్లతో తనను అడ్డుకోలేరని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను రాసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై గవర్నర్ ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ వివాదం, బిల్లుల పెండింగ్ అంశం, కేసీఆర్‌తో గ్యాప్ తదితర అంశాలపై స్పందించారు. కోర్టు కేసులు, విమర్శలకు భయపడనని.. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనన్ను కట్టడి చేయలేరని అన్నారు తమిళిసై. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది..కానీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని.. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు.
రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదన్నారు తమిళిసై. ప్రభుత్వం పంపించిన వివిధ బిల్లుల విషయంలో అభిప్రాయ బేధాలు మాత్రమే ఉన్నాయి తప్ప విభేదాలు లేవన్నారు. ఆర్టీసీ బిల్లులో కొన్ని లోపాలను గుర్తించి తిరిగి పంపానని చెప్పారు. బిల్లులను తిరిగి పంపడంలో ఎలాంటి రాజకీయం లేదని తమిళిసై తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో రాజకీయ అనుభవం ఉందని..ఆయనను చూసి చాలా నేర్చుకున్నానని తమిళిసై వ్యాఖ్యనించారు.
తాను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోనని..తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో తాను తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే ప్రయత్నించానన్నారు. తనది ఎవరినీ మోసం చేసే మనస్తత్వం కాదన్నారు. తన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహించడమే తనకు తెలుసునని చెప్పారు.
కేసీఆర్, తమిళిసై మధ్య కొంత కాలంగా గ్యాప్ కొనసాగుతూ వచ్చింది. ఎంతో అవసరమైతే తప్ప.. ఒకరినొకరు కలుసుకునే వారు కూడా కాదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నందు వల్లే ఏమో వీరిద్దరి మధ్య దూరం తగ్గినట్లు కనిపిస్తోంది. ఇటీవల కొత్త సచివాలయానికి తమిళిసైను కేసీఆర్ ఆహ్వనించారు. దీంతో వీరి మధ్య విభేదాలు సమసిపోయాయని అంతా అనుకున్నారు.పెండింగ్‌లో ఉన్న బిల్లులకు తొందరలోనే క్లియరెన్స్ వస్తుందని భావించారు. కానీ వాటిపై సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది. అయితే తాజాగా, గవర్నర్ తమిళిసై మాటలు చూస్తుంటే కేసీఆర్ ప్రభుత్వంతో బంధం బలపడినట్లు తెలుస్తోంది. కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ ఆల్ మోస్ట్ తగ్గినట్లేనని అందరూ భావిస్తున్నారు.