Khammam Floods: ఖమ్మం జిల్లాలో హైలెర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంటగంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి కావాల్సిన ఆహార, ఇతర ఏర్పాట్లను చూడలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు.
మరో రెండు రోజులు…
తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతిదిశగా వంగి ఉందని.. రాబోయే రెండురోజుల్లో ఉత్తర దిశగా వైపు కదులుతుందని వాతావరణశాఖ ప్రకటించింది.
ఇక రుతుపవన ద్రోణి సూరత్‌గఢ్, రోహ్‌తక్, ఒరై, మండ్లా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలోని అల్పపీడన కేంద్రం నుంచి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు భారీ వర్షసూచన ఉన్న జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.