బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోడానికి దారితీస్తున్న పరిస్థితులపై ఆందోళన చెందారు. వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకుని పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని కల్పించాలని వైస్ చాన్సెలర్ ను ఆదేశించారు.
విద్యార్థుల్లో భరోసా కల్పించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి, ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికను 48 గంటల్లోగా సమర్పించాలని వీసీని ఆదేశించారు గవర్నర్. ఈ మేరకు శుక్రవారం ఆమె లేఖ రాశారు.
విద్యార్థులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మహత్యల ఆలోచనలకు తావు ఇవ్వొద్దని సూచించారు. ఉన్నత చదువులను పూర్తి చేయడానికి, ఎదరవుతున్న సవాళ్ళను అధిగమించేలా ఆత్మ స్థైర్యంతో ఉండాలని కోరారు. మరోవైపు విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. పిల్లలు వరుసగా చనిపోతుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శలు చేస్తున్నాయి.