మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. భోళాశంకర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆగస్టు 11న భోళాశంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. గాయత్రి ఫిలిమ్స్ వేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది.

New Update
మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. భోళాశంకర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని గాయత్రి ఫిలిమ్స్ తరపున సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ వేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేఇసంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం(ఆగస్టు 11) సినిమా విడుదల కానుంది.

గతంలో అఖిల్ నటించిన ఏజెంట్ విషయంలో ఈ సినిమా నిర్మాతలు తనను మోసం చేశారని సత్యనారాయణ పిటిషన్‌లో వివరించారు. తనకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర రూ.30 కోట్లు మేర మోసం చేసినట్లు ఆరోపించారు. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో అయిదేళ్లపాటు తన గాయత్రీ ఫిలిమ్స్‌కు ఇస్తానని చెప్పి తన నుంచి రూ.30 కోట్లు తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సివిల్ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సివిల్ కోర్టు తీర్పుపై నిర్మాత నట్టికుమార్ స్పందిస్తూ డిస్ట్రిబ్యూటర్లకు ఇది చీకటి రోజు అని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక డిస్ట్రిబ్యూటర్ 30 కోట్ల రూపాయలు పోగొట్టుకుని రోడ్డు మీద ఉన్నాడని.. సినిమా పెద్దలు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కోర్టు తీర్పుపై హై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తమ డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తమ సమస్యలు పట్టించుకుంటే కోర్టుల దాకా ఎందుకు వస్తామని ఆయన నిలదీశారు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తమిళ మూవీ వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ సినిమా రూపొందింది. అయితే మన తెలుగు నేటివిటీతో పాటు చిరు క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసినట్లు యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించగా సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి కీలక పాత్రలు చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీకి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భోళా శంకర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు